వైజాగ్ స్టీల్ ప్లాంట్ టేకోవర్‌పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ టేకోవర్‌పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విషయం పరిజ్ఞానం లేని ఆయనకు చెబితే ఓ బాధ.. చెప్పకుంటే ఓ బాధ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు వచ్చిన సందేహం మరెవరికీ రావొద్దనే ఉద్దేశంతో దీనిపై పూర్తి వివరణ ఇచ్చారు.
‘ మీరు విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం.. బయ్యారం విషయంలో ఎందుకు లేదు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడినట్లుగా ఇవాళ పత్రికల్లో చూశా. ఆయనకేమో విషయ పరిజ్ఞానం లేదు. విషయం తెలియదు. ఆయనకు చెబితే ఒక బాధ.. చెప్పకపోతే ఒక బాధ. ఆయన విచిత్రమైన మనిషి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఎలా మాట్లాడతాడో.. ఎందుకు మాట్లాడుతాడో అర్థం కాదు. కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్న.. వేరేవాళ్లకు వస్తే వారికి అయినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది.’ అంటూ దాని వెనుక ఉన్న అసలు విషయాన్ని క్షుణ్నంగా వివరించారు. ‘ విశాఖ ఉక్కుకు, బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధం బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్. బైలదిల్లా అనేది ఛత్తీస్‌గఢ్ నుంచి ఒడిశా దాకా వ్యాపించిన ఐరన్ ఓర్ గని. ఇది చాలా పెద్ద గని. 134 కోట్ల మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఉన్న గని బైలదిల్లా. భౌగోళికంగా చూస్తే ఇది బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైజాగ్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. బైలదిల్లాలో నాణ్యమైన ఐరన్ ఓర్ ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే తేల్చిచెప్పాయి. ‘ అని తెలిపారు.
బయ్యారం గురించి 2014 నుంచి అడుగుతూనే ఉన్నాం
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వివరంగా చెప్పారు. అదేవిధంగా కడపలో కూడా స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలోని బయ్యారం గురించి మేం అడగగలం కాబట్టి.. 2014 నుంచి అడుగడుగున ప్రశ్నిస్తూ వస్తున్నాం. దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని సీఎం కేంద్రానికి ఉత్తరాలు రాశారు. పరిశ్రమల మంత్రిగా కొన్నిరోజులు మైన్స్ డిపార్ట్‌మెంట్ చూసిన సమయంలో కేంద్రమంత్రులను కలిశా. వీరేంద్ర చౌదరి స్టీల్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఎన్‌ఎండీసీ 50వ వార్షికోత్సవానికి వస్తే హైదరాబాద్‌లోనే అడిగాం. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఎందుకు పెడతలేరని అడిగితే.. సాధ్యాసాధ్యాలను పరిశీలిద్దాం. కానీ కొత్తగూడెంలో ఒక ప్లాంట్ పెడదాం. ఇంకో దగ్గర ఇంకో పరిశ్రమ పెడదామంటూ చెప్పుకొచ్చారు. జూన్ 2018లో స్వయంగా ప్రధాని మోదీని కలిసి బయ్యారం గురించి మాట్లాడినం.
ప్రధాని మోదీకి కూడా వివరించాం
బయ్యారం గురించి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని దానిపై వివరించాం. బయ్యారం ఎక్కడైతే ఉందో అక్కడ దొరికే ఐరన్ ఓర్ లో గ్రేడ్ ఉందని.. ఫెర్రస్ నాణ్యత 64 శాతం ఉంది కాబట్టి సాధ్యం కాదని మీ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పా. కానీ బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్లలోపే బైలదిల్లా ఉంది. బైలదిల్లా నుంచి మొత్తం ఫారెస్టే ఉంది. కాబట్టి మనం ఒక స్లరీ పైప్‌లైన్ వేసుకోవచ్చు. స్లరీ పైప్‌లైన్ వేయడంలో 50 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వం కూడా భరిస్తుంది. బయ్యారంలో ప్లాంట్ పెడితే 15, 20వేల మంది మా గిరిజన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తెలంగాణకు ఆదాయం వస్తుంది. ఒక వెనుకబడిన ప్రాంతానికి ఫ్యాక్టరీ వస్తుంది. మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. అని 2018లో స్వయంగా ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశా. మొత్తం వివరాలను సమర్పించా. అప్పటికే ముఖ్యమంత్రి, అధికారుల బృందాలు కలిసి చెప్పాయి.
ఇదీ అసలు కుట్ర
కానీ దీని వెనుక జరుగుతున్న కుట్రను అర్థం చేసుకోలేకపోయాం. ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చికుక్క అని ముద్ర వేయాలి. ఆ తర్వాత అది పిచ్చికుక్క కాబట్టి కాల్చి చంపినమంటే ఎవరూ ఏమనరు కాబట్టి ఖతం చేయాలి. బైలదిల్లా విషయంలో కూడా ఇదే ఎజెండా. బయ్యారం విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిందని మొదలుపెట్టగానే.. దీనివెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు కదిలారు. 2018 సెప్టెంబర్‌లో బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో అదానీ ఒక కంపెనీని తెరిచిండు. అంతకంటే ముందే కొంచెం కథ నడిచింది. జపనీస్ స్టీల్ మిల్స్‌కు, దక్షిణ కొరియాకు చెందిన పాష్కో కంపెనీకి బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ సప్లై చేస్తామని 2018 ఏప్రిల్‌లో కేంద్ర కేబినెట్ ఓ నిర్ణయం తీసుకుంది. బైలదిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పింది. ఆ వెంటనే అదానీ ఈ కంపెనీని తెరిచాడు. ఇక్కడి మైనింగ్‌ను పాష్కోకు ఇస్తామని చెప్పంగనే.. వాళ్లను కలిసి 40వేల కోట్లు ( 5బిలియన్ డాలర్లు ) పెట్టుబడితో గుజరాత్‌లోని ముంద్రాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ కంపెనీ పెడుతున్నా అని అదానీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో పాష్కో కంపెనీ వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ పెడుతుందా అని ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి 2021 అక్టోబర్‌లో పార్లమెంట్‌లో ఒక ప్రశ్న అడిగిండు. దానికి పాష్కో కంపెనీ ఆలోచన చేస్తుందని కేంద్రం సమాధానమిచ్చింది. 2019 అక్టోబర్‌లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చి పరిశీలించారు. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే ఆలోచనలో ఉన్నారని కేంద్రం బదులిచ్చింది.
అదానీ కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చావుదెబ్బ
ఇక్కడ ఫైనల్ స్టోరీ ఏంటంటే.. బైలదిల్లా నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ ఇస్తే అదానీకి నష్టం. అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సప్లై చేస్తే.. ముంద్రాలో అదానీ పాష్కో పెట్టాలని సంకల్పించిన ఫ్లాంట్‌కు నష్టం. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక బైలదిల్లాను అదానీకి కట్టబెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాలను చావుదెబ్బ తీసింది. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడదామంటే అదానీకి మన జుట్టు ఇవ్వాలి. అదానీ, మోదీ చెప్పినట్లు వినాలి. అట్లయితే బయ్యారంలో పెట్టొస్తది. అందుకే వాళ్లు పెట్టమని అంటున్నారు. బయ్యారం ఈజ్ నాట్ ఫీజబుల్ అని కిషన్ రెడ్డి అంటున్నడు. నాణ్యమైన ఐరన్ ఓర్ అదానీకి అప్పజెప్పినం కాబట్టి.. ఇట్ ఈజ్ నాట్ ఫీజబుల్ ఫర్ స్టీల్ అథారిటీ అని స్టేట్‌మెంట్ ఇచ్చిండు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టింది. అది ఎందుకు అమ్మకానికి పెట్టిర్రు అంటే.. గనులు ఇవ్వక, కేటాయింపులు చేయక.. ఇవ్వాల్సిన ఐరన్ ఓర్ ఇవ్వక దాన్ని బలవంతంగా నష్టాల్లోకి నెట్టారు. బైలదిల్లా నుంచి డైరెక్ట్‌గా ఐరన్‌ఓర్ ఇస్తే వైజాగ్ స్టీల్ కూడా నడుస్తుంది. కానీ ఇయ్యరు. ఇవ్వకుండా అదానీకి కట్టబెట్టి వైజాగ్ పొట్టకొట్టారు.
నేను చెప్పింది తప్పయితే పరువు నష్టం దావా వేయండి
బయ్యారం నుంచి బైలదిల్లా 150-160కిలోమీటర్లు. బైలదిల్లా నుంచి వైజాగ్ 600 కిలోమీటర్లు. అదే ముంద్రాకు 1800 కిలోమీటర్లు. ఇక్కడ ఫీజబుల్ కాదు.. కానీ తవ్వి 1800 కిలోమీటర్లు తీసుకెళ్తే ఫీజబుల్ ఎట్లయితది. ఇక్కడ ఉండే అజ్ఞాన బీజేపీ నాయకులు అర్థం చేసుకోకపోవచ్చు.. అర్థమైనా అదానీ కోసం నోరు మూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్లు అజ్ఞాని, ఆయన ఆదానీ.. డెడ్లీ కాంబినేషన్. వీళ్లు అర్థం చేసుకోకపోయినా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి. వైజాగ్ పొట్టకొడుతున్నది ప్రధాని, అదానీ.. బయ్యారం ఎండబెడుతున్నది కూడా ప్రధాని, ఆదానీయే. ఇక్కడ ఉండే అజ్ఞానికి.. ఆ ఆదానికి సంబంధం మాకు అవసరం లేదు. కానీ ప్రధాని, ఆదానీ కలిసి తెలుగు రాష్ట్రాల ప్రజల పొట్టుకొడుతున్నారనేది వాస్తవం. ఇది నిర్దిష్టమైన ఆధారాలతో చేస్తున్న ఆరోపణ. నేను చెప్పిన మాట తప్పయితే.. పరువు నష్టం దావా వేయండి.