అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎంతో పాటు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకం మహిళలతో పాటు బాలికలు, ట్రాన్సోజెండర్లకు కూడా వర్తిస్తుందని ఇప్పటికే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. “పల్లె వెలుగు, ఎక్ ప్రేస్, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అంతర్ రాష్ట్ర ఎక్ ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చు” అని ఆయన తెలిపారు.