సీపీఎస్ రద్దు చేయలేమని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రూ. పదివేల కనీస పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన పెట్టింది.
సీపీఎస్‌ను రద్దు చేసే ప్రశ్నే లేదని అయితే సీపీఎస్ కన్నా మంచి స్కీం ఇస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సీపీఎస్, జీపీఎస్ అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశం అయింది. ఉద్యోగ సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. అయితే సమావేశంలోనూ అటు ఉద్యోగ సంఘాల నేతలు, ఇటు ప్రభుత్వ కమిటీ ఎవరి వాదనకే వారు కట్టుబడ్డారు. సమావేశం ముగిసిన తరవాత మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాణ… సీపీఎస్ రద్దు చేసేది లేదని ఇప్పటికి చాలా సార్లు చెప్పామన్నారు. గత జీపీఎస్ కన్నా మెరుగైన జీపీఎస్‌ను తెస్తున్నామని.. ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చే ప్రతిపాదన కూడా చేశామన్నారు. పెన్షన్ 10 వేలు కనిష్టంగా పెన్షన్ మొదలు అవుతుందన్నారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే విధంగా పెన్షన్ ప్రారంభమవుతుందన్నారు. మాకున్న పరిస్థితి బట్టి ఉద్యోగ సంఘాలతో మాట్లాడామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం సీపీఎస్ పై ఏప్రిల్ 5 న మొదట సమావేశం పెట్టీ జీపీఎస్ ను తెర మీదకు తెచ్చారు. ఆ సమావేశం లో ప్రభుత్వ ప్రతిపాదన ను ఒప్పుకోమని చెప్పామమని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. గతం లో సీపీఎస్ ఉద్యోగులను పంపి స్టడీ టూర్ చేశారు…ఆ టూర్ ఫలితం మాకు చెప్పలేదన్నారు. జీపీఎస్ 2.0 అనే కొత్త ప్రతిపాదన ను తెరమీదకు తెచ్చారని.. దీనిలో 10 వేల రూపాయలు మినిమం, 33.5 శాతం పెన్షన్ ఇస్తాము అని చెప్పారన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి, కేంద్రం తో వున్న సంబంధాల నేపథ్యంలో ఓపీఎస్ అమలు చేయలేం అన్నారని..దానికి ఒప్పుకోము అని చెప్పి వచ్చేశామమని సూర్యనారాయణ స్పష్టం చేశారు.
ఐదు సవరణల తో జీపీఎస్ 2.0 ను తెర మీదకు తెచ్చారని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. దానికి కూడా అంగీకరించేది లేదని చెప్పామమన్నారు. జీపీఎస్ తో 33 శాతం లోనే ఉద్యోగి సరిపెట్టుకోవాల్సి వుందని..ఏపీ జేఏసీ , ఏపీ NGO సంఘాలు OPS నే కోరుకుంటున్నాయని బండి శ్రీనివాసరావు తెలిపారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల్లో సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే అప్పట్లో అవగాహన లేక హామీ ఇచ్చారని .. సీపీఎస్ రద్దు చేయడం సాద్యం కాదని జగన్ చెబుతున్నారు. దీంతో సీపీఎస్ రద్దు చేయకపోయినా అంతకు మించిన మేలు చేస్తామని జీపీఎస్ ప్రతిపాదన తెచ్చారు.
ఇటీవలి కాలంలో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా వేశారు. తాజాగా పదకొండో తేదీన నిర్వహించాలనుకున్నా అదీ కూడా వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా తాము మాత్రం ఉద్యమం చేస్తూనే ఉంటామని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే వారితో ఎలాగైనా జీపీఎస్‌కు అంగీకరింప చేసి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశం ఎలాంటి ముగింపునకు వస్తుందో కానీ అటు ప్రభుత్వం ఇటు ఉద్యోగులు ఎవరూ తగ్గడం లేదు.