SAKSHITHA NEWS

వేసవి ప్రత్యేక, రెగ్యులర్‌ క్రీడా శిక్షణ తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలి.

  • జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

వేసవి ప్రత్యేక, రెగ్యులర్‌ క్రీడా శిక్షణ తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ జిల్లా విద్యాశాఖ, క్రీడాభివృదిశాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో వేసవి ప్రత్యేక శిక్షణ తరగతుల నిర్వహణపై జిల్లా విద్యాశాఖాధికారి, క్రీడాభివృద్ధి అధికారి, సమ్మర్‌ క్యాంపు ఇంచార్జ్‌ బాధ్యులు, శిక్షకులు, మండల విద్యాధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవి శిక్షణ క్యాంపులలో ఎక్కువ మంది విద్యార్ధులు ముఖ్యంగా 8 నుండి 12 సంవత్సరాల వారు శిక్షణకు వచ్చే విధంగా చూడాలని అన్నారు. ప్రతి సమ్మర్‌ కొచింగ్‌ క్యాంపులో యాభై శాతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. శిక్షణ కాలంలో క్రీడాకారుల ప్రతిభను గుర్తించడం, వారి వివరాలు నమోదు చేయాలన్నారు. జిల్లాలోని జాతీయ స్థాయి సౌకర్యాలు కలిగిన ఖమ్మం నగరం సర్దార్‌పటేల్‌ స్టేడియం, వైరా ఇండోర్‌స్టేడియం, కల్లూరు స్టేడియంలలో ఎక్కువ మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాల్సిందిగా తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను గుర్తించి వారికి జిల్లా స్థాయిలో శిక్షణ ఇప్పించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ప్రాథమిక పాఠశాలల నాల్గవ తరగతి విద్యార్థులు స్పోర్ట్స్‌ అడ్మిషన్‌లో పాల్గొనేటట్లు చూడాలన్నారు. వేసవి క్రీడా శిక్షణ క్యాంపులను నిర్వహించేందుకు పటిష్టంగా చర్యలు చేపట్టాలన్నారు. సమ్మర్‌ క్యాంపుల నిర్వహణలో భాగస్వాములై ఎక్కువ మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కోచ్‌లను, ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ఇన్‌సెంటీవ్‌ ఇవ్వటం జరుతుందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో 10, పట్టణ ప్రాంతాల్లో 25 క్యాంపులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 35 క్యాంపులను సమర్ధవంతంగా నిర్వహించి ఎక్కువ మంది క్రీడాకారులకు శిక్షణనిచ్చి విజయవంతం చేయాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ, మండల విద్యాశాఖ అధికారులు, కోచ్‌లు, క్యాంపుల ఇంచార్జ్‌లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS