SAKSHITHA NEWS

State Budget on 6

6న రాష్ట్ర బడ్జెట్‌

2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ నెల 6న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఈ నెల 3న గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. ఉభయసభలు శుక్రవారం మధ్యా హ్నం 12.10 గంటలకు అసెంబ్లీహాల్‌లో సమావేశం కానున్నట్టు గవర్నర్‌ తమిళిసై నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు.

అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌, పద్దులపై చర్చ ఏ రోజున చేపట్టాలనే అంశాలపై బీఏసీలో నిర్ణయిస్తారు.

బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వీ నర్సింహాచార్యులు మంగళవారం పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం సమీక్షంచనున్నారు.

శాసనసభా సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నియంత్రణ, సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. బడ్జెట్‌ ప్రసంగం, ప్రతులు, పద్దులపై చర్చ, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తదితర అంశాలపై అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు.


SAKSHITHA NEWS