SAKSHITHA NEWS

సాక్షిత సంగారెడ్డి: రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వచ్చి పది సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా 21 రోజుల పండుగ చేసుకుంటున్నామని, ఇవాళ అత్యంత ముఖ్యమైన రోజన్నారు. ఒకప్పుడు నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ కరవు ప్రాంతాలుగా ఉండేవని, గతంలో ఈ ప్రాంత రైతులు నీళ్ల కోసం ఆకాశం వైపు చూసేవారని గుర్తు చేశారు.

వానలు పడక వేసిన విత్తనాలు మెలకెత్తని పరిస్థితి ఉండేదని, సింగూర్ ప్రాజెక్ట్ కట్టి ఇక్కడి భూములు ముంచిన గత ప్రభుత్వం నీళ్లు మాత్రం ఇక్కడి ప్రజలకు ఇవ్వలేదన్నారు. రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పూర్తి చేసి నీళ్లిస్తామని, ఆ తర్వాత ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరం సస్యశ్యామలం అవుతుందన్నారు. రెండు పంటలు పండుతాయని, తెలంగాణ రావడం, కేసీఆర్‌ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి గడపకే తాగునీరు వస్తున్నాయని, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రతి పొలం వద్దకే సాగునీరు వస్తుందన్నారు. గతంలో ఈ ప్రాంతలో విద్యుత్ కోతలే ఉండేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలకు 24గంటల కరెంట్ ఇస్తోందన్నారు.

సింగూర్ నీళ్లు ఇక్కడి ప్రజల సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకే ఉపయోగపడేలా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందని, సంగారెడ్డికి వైద్య కళాశాల ఇవ్వడంతో పాటు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మహిళలు ఆదరించాలన్నారు. 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా ఇవ్వడంతో పాటు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు ఆదరించాలన్నారు. జహీరాబాద్, ఆందోల్ వెనకబడ్డ ప్రాంతం కాదని, వెనుకబడేయబడిన ప్రాంతమన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తామన్నారు. 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి తొమ్మిదేళ్లలో జరిగిందన్నారు. ఇదిలా ఉండగా.. సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.2,653 కోట్లతో నిర్మిస్తున్నది. .19లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పథకానికి శ్రీకారం చుట్టింది. గోవిందాపూర్‌ నుంచి 660 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు ఎత్తిపోయనున్నది. సంగమేశ్వర ద్వారా సంగారెడ్డి, ఆందోల్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం కాళేశ్వరం నుంచి 12టీఎంసీలను కేటాయించింది.

WhatsApp Image 2023 06 07 at 5.35.59 PM

SAKSHITHA NEWS