డ్రగ్స్‌పై పోరాడడంలో యువత చురుగ్గా పాల్గొనాలి: సందీప్ శాండిల్య ఐపీఎస్.,”
మాదకద్రవ్యాల వినియోగం మరియు నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో, రాచకొండ భద్రతా మండలి రాచకొండ పోలీస్ కమిషనరేట్ సహకారంతో, హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో మత్తుపదార్థాల దుర్వినియోగ నిరోధక సదస్సు -2024 ను నిర్వహించింది. కార్యక్రమంలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించే మార్గదర్శకాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) డైరెక్టర్.. సందీప్ శాండిల్య ఐపీఎస్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం సమాజంపై, ముఖ్యంగా యువతపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతోందో వివరించారు. డ్రగ్స్ మరియు ఇతర నిషేధించబడిన సైకోట్రోపిక్ పదార్థాలు వాడడం ద్వారా తెలివైన విద్యార్థులు తమ విద్య మరియు భవిష్యత్తును ఎలా పాడు చేసుకుంటున్నారో వివరించారు.
అన్ని రకాల మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. డ్రగ్స్‌పై పోరును సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ లక్ష్యాన్ని సాధించే సామాజిక ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పోలీసులకు సూచించారు. నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొత్త సంవత్సరానికి ముందు 90 పబ్‌లను తనిఖీ చేశామన్నారు.
డ్రగ్స్ ప్రాణాంతకమని, వాటి వినియోగం వల్ల మెదడు నియంత్రణ కోల్పోతుందని, జీవితంలో అనేక అనర్థాలకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ వాడితే ముందు రెచ్చిపోయి ఆ తర్వాత అలవాటైపోతుంది, అది లేకుండా బతకలేం అన్న స్థాయికి దిగజారుస్తుందని అన్నారాయన. మత్తు పదార్ధాలు ఒక్కసారి సేవిస్తే వాటికి శరీరం అలవాటు పడుతుందని, వాటిని మానుకోవాలని, డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారి జీవితాలు దుర్భరంగా మారుతాయని పేర్కొన్నారు.
రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ ప్రసంగిస్తూ.. విద్యార్థులు తమ జీవితంలో ఒక్కసారి కూడా డ్రగ్స్‌ని ఉపయోగించవద్దని కోరారు. విద్యార్థులకు భరోసా ఇస్తూ అన్ని కళాశాలలు, హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. అదే సమయంలో, డీలర్లు, డ్రగ్ సరఫరా దారుల నుండి వినియోగదారుల వరకు మొత్తం డ్రగ్ చైన్‌ను నాశనం చేయడానికి మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాచకొండ పోలీసులు ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 12 పీడీ కేసులను నమోదు చేశారని, సుమారు 5 కోట్ల విలువైన డ్రగ్స్ మరియు ఇతర నిషేధిత సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ విక్రయదారులు, వినియోగదారులను గుర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సరఫరా గొలుసును ఛేదించేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుందని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ వ్యాపారులు వాటిని వినియోగించరని, యువతకు మాత్రమే డ్రగ్స్ విక్రయిస్తున్నారని యువత గమనించాలని అన్నారు.
మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు నిషేధించబడిన ఇతర మందుల వాడకానికి వ్యతిరేకంగా మరింత అవగాహన కార్యక్రమాలు అవసరమని సీపీ నొక్కిచెప్పారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు సీపీ సూచించారు. డ్రగ్స్ వాడడం వల్ల వారి విలువైన శారీరక, మానసిక ఆరోగ్యం అనేక విధాలుగా నాశనం అవుతుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొని డ్రగ్స్ ఫ్రీ సొసైటీగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని సీపీ సూచించారు. డ్రగ్స్‌పై పోరులో రాచకొండ భద్రతా మండలి చేస్తున్న కృషిని సీపీ అభినందించారు. రాచకొండ కమిషనరేట్ ఆర్కెఎస్సితో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి కళాశాలలో డ్రగ్స్ మహమ్మారిపై పోరాడి తోటి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేక విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీపీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీపీ సైబరాబాద్ అవినాష్ మహంతి ఐపీఎస్ మాట్లాడుతూ.. డ్రగ్స్ అలవాటు చాలా దారుణమని, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఎంతో మంది అధికారులు మరియు ఇతర విజయవంతమైన వ్యక్తులు తమ జీవితంలో ఏదైనా సాధించడానికి అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారనే విషయాన్ని మొహంతి వివరించారు. మహంతి గారి IPS శిక్షణ సమయంలో వారి బ్యాచ్‌మేట్ అయిన IPS ఆఫీసర్ మనోజ్ శర్మ యొక్క స్ఫూర్తిదాయకమైన విజయగాథ ఆధారంగా రూపొందించబడిన ఇటీవలి బాలీవుడ్ చిత్రం 12th ఫెయిల్ గురించి ప్రస్తావించారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరించడం విజయాన్ని చేరుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
ఎరిన్ ఫిషర్, యుఎస్ కాన్సులెట్ చీఫ్ ఇన్వెస్టీగేటర్, భోంగిరి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, డీసీపీ మల్కాజిగిరి పద్మజ ఐపీఎస్., డీసీపీ ఎస్ఓటీ గిరిధర్ ఐపీఎస్., ఎల్బి నగర్ డీసీపీ ప్రవీణ్ ఐపీఎస్, ఎస్బి డీసీపీ కరుణాకర్, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ మహేశ్వరం సునీతారెడ్డి, డీసీపీ ఎస్ఓటీ మురళీధర్, ఏడీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి, ఎండ్ నౌ ఫౌండర్ అనిల్ రాచమల్ల, ఆర్కేఎస్సీ కోశాధికారి గగన్ దీప్ కోహ్లి, ఇతర అధికారులు మరియు పలు కళాశాలల విద్యార్థులు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.