అగ్నిమాపక దళ వారోత్సవాల లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Spread the love

సాక్షిత సికింద్రాబాద్ : అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను అదుపు చేయడం, ఇతర ప్రకృతి వైపరిత్యాలు చోటుచేసుకున్న సమయంలో అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. అగ్నిమాపక దళ వారోత్సవాల సందర్బంగా బేగంపేట లోని అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.


ఈ సందర్బంగా మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అగ్నిప్రమాదాల సమయంలో వినియోగించే యంత్ర సామాగ్రి, పరికరాలను పరిశీలించి అగ్నిమాపక సిబ్బంది రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా విధి నిర్వహణలో అసువులు బాసిన సిబ్బందికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర అధికారులు, సిబ్బంది సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల రూబీ హోటల్, డెక్కన్ మాల్, స్వప్న లోక్ కాంప్లెక్స్ లలో జరిగిన అగ్నిప్రమాదాలు చాలా బాధాకరం అని, ఆయా సంఘటనలలో పలువురు మరణించారని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారని, తద్వారా ఆస్తి, ప్రాణనష్టం మరింత జరగకుండా చేయగలిగారని అన్నారు.

ప్రమాదాలు సంభవించినప్పుడు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బందిని మంత్రి ఈ సందర్బంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అగ్నిమాపక శాఖ ను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. నూతనంగా 43 ఫైర్ స్టేషన్ లను మంజూరు చేయడమే కాకుండా, బడ్జెట్ లో 32 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇవే కాకుండా నగరంలో గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, భారీ భవనాలలో ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను అదుపుచేసేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి, హోంమంత్రి ల దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు.

సిబ్బంది కొరత సమస్య పరిష్కారానికి కూడా తనవంతు కృషి చేస్తానని చెప్పారు.వారోత్సవాల సందర్బంగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి,రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, జిల్లా ఫైర్ ఆఫీసర్ మధుసూదన్ రావు, అదనపు జిల్లా ఫైర్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి,సికింద్రాబాద్ ఫైర్ ఆఫీసర్ మోహన్ రావు,బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page