హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలు బీఆర్ఎస్ గెలవాలని పార్టీ నేతలకు సూచించారు. ఒకటే నియోజకవర్గం, ఒకటే సీటు, ఒకటే బీఫాం ఉంటుందని, అందరికీ టికెట్లు ఇవ్వలేమని, పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా వారికి మద్దతుగా నిలిచి గెలిపించుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆశలు, విభేదాలను పక్కన పెట్టి అధిష్టానం నిర్ణయాన్ని పాటించాలని సూచించారు.
ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల నేపథ్యంలో నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని, 4 వేల పెన్షన్లు, 25 గంటల కరెంట్ ఇస్తాం అంటున్నారని, మరి ఇన్నేళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. అంతకుముందు తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ గుప్త బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు మంత్రి కేటీఆర్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప్పల వెంకటేష్‌కు కచ్చితంగా పెద్ద పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక, తలకొండపల్లికి వస్తా.. మీ సత్తా చూస్తా అని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.