ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎండదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల మధ్యలో అత్యవసరం అయితే తప్ప ఎండలో తిరగవద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆశ, ఎ.ఎన్. ఎం. ల వద్ద, అంగన్ వాడీలలో ఓ.అర్.ఎస్. ద్రావణం అందుబాటులో ఉంచినట్లు, పి.హెచ్.సి. ల యందు ఓ.ఆర్.ఎస్. ద్రావణం, ఐ.వి. ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. చిన్నారులు, వయోవృద్దులు ఇంటికే పరిమితం కావాలని, ప్రతిరోజు సరిపడ త్రాగునీరు తీసుకోవాలని, వదులుగా ఉన్న దుస్తువులను ధరించాలని, బయటికి వెళ్ళేటప్పడు గొడుగు, టోపిని, సన్నని లేత రంగు కాటన్ వస్త్రాలను ధరించాలని, ద్విచక్ర వాహానాలపై సుదూర ప్రయాణాలు చేయకూడదని, సూర్యుని కిరణాలు శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
అలాగే ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటీతో పాటు ఓ.ఆర్.ఎస్. ద్రావణాన్ని తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చన్నారు. వేడి ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోవాలనీ, వంట ప్రదేశాన్ని తగినంతగా గాలి, వెలుతురు ఆడడానికి తలుపులు, కిటికీలను తెరవాలని, ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటెడ్ శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలని, ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోవడానికి లేదా కడుపు నొప్పికి దారి తీయవచ్చని అన్నారు. అధిక మాంసకృత్తులు కలిగిన ఆహారాన్ని , నిల్వ ఆహారాన్ని తినవద్దని, నిలిపి ఉంచిన వాహనంలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దని, వాహనం లోపల ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదకరంగా మారవచ్చని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలతో ఉన్న ఇట్టి పోస్టర్లు ప్రదర్శించాలని, బస్సు డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. అధిక చమట, దాహం, బలహీనత, తల తిప్పడం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు వున్నచో వడదెబ్బగా భావించి సమీప ఆరోగ్య కేంద్రం తీసుకెళ్ళడం లేదా 108కు ఫోన్ చేయాలని కోరారు. అదే విధంగా వీరికి సహాయం అందువరకు చల్లని ప్రదేశానికి తరలించాలని, చల్లని నీటితో శరీరాన్ని తుడవాలనీ, వీలైనంత గాలి తగిలే విధంగా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, టీఎస్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం పవిత్ర, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సైదులు, ఎస్డీపివో నీలోహన, అధికారులు తదితరులు ఉన్నారు.