ధరిత్రిని కాపాడుకుందాం

Spread the love

భూమిని గౌరవిస్తేనే మనుగడ
మానవాళితోపాటు సకల జీవరాశులకు భూమే జీవనాధారం. పంటలకు, తాగునీటికి పుడమే మూలాధారం. పంచ భూతాలలో ప్రధానమైనది, విశ్వంలో అత్యంత ప్రధానమైనది ధరణే. గాలి, నీరు ఆవరించి ఉండే ఈ నేలకు ఇప్పుడు పెద్ద ముప్పు వచ్చి పడింది. మానవుడి స్వార్థ ప్రయోజనాలకు ధరిత్రి చిన్నబోతోంది. అడవుల నరికివేత, ఖనిజాల తవ్వకాలతో వేడెక్కి సహజ శక్తిని కోల్పోతోంది. పారిశ్రామిక విప్లవం వల్ల జీవావరణం అల్లకల్లోలమైపోతోంది. విపత్తులు విపరీతమై సాగు చిక్కుల్లో పడుతోంది. మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. భూమి నిస్సారంగా మారి ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు అప్పులపాలవుతున్నారు. వలసలు పెరుగుతన్నాయి. ప్రపంచంలో 46 శాతం అడవులు కనుమరుగయ్యాయని అధ్యయనాలు చెప్తున్నాయి. భూమిపై పచ్చదనం తగ్గిపోవడమే ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం. ఈ ధరిత్రిలో మనిషికి లోబరిచిన వనరులన్నీ అప్పగింతగా భావించాలంటోంది ఖుర్ఆన్. ప్రతి అనుగ్రహం గురించి ప్రళయ దినాన ప్రశ్నలు ఎదుర్కోవాలని హెచ్చరిస్తుంది. నేలపై నడిచేటప్పుడు మర్యాదగా, వినయంతో నడవాలని హితవు పలుకుతుంది.
ఆ రోజున భూమి మాట్లాడుతుంది..


భూమి పూర్తి తీవ్రతతో ఊపి వేయబడినప్పుడు, తన లోపల ఉన్న మొత్తం భారాన్ని తీసి బయటవేసినప్పుడు మానవుడు, ‘‘దీనికేమైంది (ఇలా ఊగిపోతోంది)’’ అని అంటాడు. ఆ రోజున అది తన (పైన సంభవించిన) విశేషాలను వివరిస్తుంది (ఖుర్ ఆన్ 99:1-5). ప్రళయ బీభత్స ధాటికి సృష్టి యావత్తు అంతమైపోతుంది. ఆ రోజున భూమి తనపై జరిగిన అఘాయిత్యాలన్నింటినీ వివరిస్తుంది. ‘‘భూమి పట్ల కాస్త జాగ్రత్తగా మెలగాలి. అది మీ మూలం, మీ పునాది. దీని మీద ప్రతి వ్యక్తి చేసే పని మంచిదైనా, చెడ్డదైనా.. ఆ విషయాన్ని అది ఖచ్చితంగా తెలుపుతుంది’’ అని ముహమ్మద్ ప్రవక్త సహచరులను అప్రమత్తం చేసేవారు. ‘‘ఆయన ఆకాశాన్ని, భూమిని సత్యంతో సృష్టించాడు’’ అని ఖుర్ఆన్ పేర్కొంటోంది. ‘ఎవరైతే ఒక జానెడు భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటాడో ప్రళయదినాన అల్లాహ్ అతని మెడకు ఏడు భూగోళాలంత కంఠనాళాన్ని తొడిగిస్తాడు’’ అని ప్రవక్త హెచ్చరించారు.


ప్రళయం వస్తుందన్నా మొక్కలు నాటాలి
‘మరికాసేపట్లో ఈ ప్రపంచం అంతమైపోతుందని తెలిసినా మీ చేతిలో మొక్క ఉంటే దానిని నాటండి’ అని అన్నారు ప్రవక్త (స). వృక్ష సంపద విలువను తెలియజేయడానికి ఇంతకంటే గొప్ప ఉపమానం మరొకటి ఏముంటుంది? ‘ప్రతి వ్యక్తీ ఒక మొక్క నాటినా… దాని ఫలాలను పక్షి గానీ, పశువులు గానీ, మనుషులు గానీ తిన్నా.. నాటిన వ్యక్తికి ఎంతో పుణ్యం లభిస్తుంది’ అని చెప్పి మొక్కలు నాటడాన్ని 1500 ఏళ్ల క్రితమే ప్రోత్సహించారు. మనిషి ఈ ధరిత్రిపై అడుగు పెట్టకముందే ఆ దైవం ఈ ప్రపంచాన్ని ఎన్నో రకాల వృక్ష జాతులతో అలంకరించారని ఖురాన్‌ ప్రవచిస్తోంది. వృక్ష సంపద గురించి ఇస్లాం ధర్మంలో అపార జ్ఞాన సంపద ఉంది. ‘ఎవరికీ చెందని బంజరు నేలను పంట పొలంగా మార్చిన వ్యక్తికే ఆ భూమి చెందుతుంది’ అంటూ సేద్యాన్ని ప్రోత్సహించారు ప్రవక్త. యుద్ధ సమయంలోనూ నీడనిచ్చే చెట్లను నరకరాదని, శత్రువుకు చెందిన పంట పొలాలను నాశనం చేయకూడదని చెప్పారు. నీడనిచ్చే చెట్ల కింద మలమూత్ర విసర్జన తీవ్ర నేరమని ప్రవక్త(స) చెప్పారు. నదీ జలాల్లో మలమూత్ర విసర్జన చేసేవారిని శపించారు. దేహానికి ఆత్మ ఎలాంటిదో పర్యావరణానికి భూమి, చెట్లు అలాంటివి. మనిషికి ఆహారాన్ని అందించే భూమిని, చెట్లను కాపాడుకుంటేనే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది.

(ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం సందర్భంగా..)

  • ముహమ్మద్ ముజాహిద్, 9640622076

Related Posts

You cannot copy content of this page