KCR family investments in liquor racket
మద్యం దందాలో కెసిఆర్ కుటుంబం పెట్టుబడులు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణ
నిర్మల్, భైంసా: ప్రజల సొమ్మును దోచుకుంటూ రూ.వేల కోట్లు దండుకొని మద్యం దందాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పెట్టుబడులు పెట్టిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని.. ఆ కేసును ప్రభావితం చేసి మూసివేయించారని ఆరోపించారు. కర్ణాటకలో భాజపా ప్రభుత్వమే ఉందని.. ఆ కేసును, అందులో ఉన్న వ్యక్తుల బండారాన్ని బయటకు తీస్తామన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలోని ఓలా గ్రామంలో నిర్వహించిన రచ్చబండ, కుంటాలలో నిర్వహించిన సభలో సంజయ్ ప్రసంగించారు.
ఎమ్మెల్సీ కవిత మద్యం టెండర్లలో రూ.కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి వ్యాపారాలు చేయడానికి పైసలుంటాయని, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం ఉండవా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథపై మంత్రి కేటీఆర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. ఇక్కడ నీళ్లు లేవు.. ఇళ్ల్లు లేవు, రోడ్లు లేవని విమర్శించారు.
పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణను రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఆ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు పరిష్కరించలేదన్నారు
. దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, రెండు పడకగదుల హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుబంధు పేరు చెప్పి.. మిగిలిన అన్నింటినీ బంద్ చేశారని, రుణమాఫీ కూడా అమలు చేయలేదన్నారు. తెలంగాణాలో పెద్దోడి రాజ్యం పోవాలని.. పేదోళ్ల రాజ్యం రావాలని అన్నారు.
భాజపాకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. కార్యక్రమాల్లో ఎంపీ సోయం బాపురావు, యాత్ర ప్రముఖ్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు