కరీంనగర్ జిల్లా:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సర్వంసిద్ధం చేసింది. జిల్లాలో ఎనిమిది విడతల్లో లక్ష్యానికి మించి మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రధానంగా జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ను గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా మార్చేందుకు నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఎనిమిది విడతల్లో చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో నగరంలో దాదాపు 15 లక్షలకుపైగా మొక్కలు నాటారు. వాటిలో 80 శాతానికి పైగా సంరక్షించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే..
తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో ఐదు లక్షల పండ్లు, పూలు, ఔషధ మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని నగరపాలక సంస్థ నర్సరీల్లో ఆరు లక్షలకు పైగా మొక్కలను పెంచుతున్నారు. లక్ష్యానికి మించి ఈయేడు అదనంగా మరో లక్ష మొక్కలు నాటాలని నగరపాలక సంస్థ ఆమేరకు ఏర్పాట్లు చేస్తోంది. వర్షాకాలం ఆరంభమైనప్పటికీ వర్షాలు సమృద్ధిగా పడక పోవడంతో ఆగస్టు మొదటి వారం నుంచి నగరంలో హరితహారం కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. రెండేళ్లుగా వార్షిక బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయిస్తోంది. మూడో విడత సందర్భంగా కరీంనగర్లో 16 రోజుల్లోనే లక్ష మొక్కలను నాటి లక్ష్యాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో హరితహారం కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీల్లోని వీధుల్లో మొక్కలు నాటి వదిలేస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం నాటిన మొక్కలను రక్షించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంది…..