Justice will be given to the victims of Deposit Gol Mall.. Tanniru
తన్నీరు నాగేశ్వరరావు, సహకార శాఖ జిల్లా అధికారులు, ఎమ్మెల్యే వంశీ మోహన్,
ఆత్కూరు సహకార సంఘంలో..
డిపాజిట్ గోల్ మాల్ బాధితులకు న్యాయం చేస్తాం.. తన్నీరు
గన్నవరం
ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్.శంకరరావు మరియు క్యాషియర్ గా పనిచేస్తున్న కే . శివకుమారి రూ .2.65 కోట్లు మేరకు ఖాతాదారుల డిపాజిట్ నగదును గోల్ మాల్ చేసియున్నారని, బాధితులకు న్యాయం చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఆప్కాబ్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు.
ఆత్కూర్ సహకార సంఘంలో డిపాజిట్లు సొమ్ము పోగొట్టుకున్న బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే వంశీ వినతి పత్రం ఇవ్వడంతో, సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తన్నీరు నాగేశ్వరరావు జిల్లా అధికారులతో కలిసి మంగళవారం గన్నవరం ఎమ్మెల్యే వంశీతో సమావేశం జరిపారు. తన్నీరు మాట్లాడుతూ
సహకార సంఘం నందు ఫిక్సడ్ డిపాజిట్ చేయుటకు వచ్చిన ఖాతాదారులకు నకిలీ సర్టిఫికెట్లు , నకిలీ రసీదులు ఇచ్చి సుమారు రూ .1.36 కోట్లు నగదును సంఘ ఖాతాకు జమ చేయకుండా సొంతానికి వినియోగించుకున్నారని అధికారుల విచారణలో తేలినట్లు చెప్పారు.
సంఘ పొదుపు ఖాతాలలో నగదు జమ చేసుకొనుటకు వచ్చిన ఖాతాదారుల వద్ద నగదు తీసుకుని వాటిని సంఘ ఖాతాలో జమచేయక రూ .69.00 లక్షలు మేరకు సొంతానికి వినియోగించుకున్నారని గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా సంఘంలో ఉన్న వివిధ ఖాతాదారుల ఫిక్సడ్ డిపోసిట్స్ పై రుణాలను వారు ఇరువురు దరఖాస్తులు నింపుకొనుట ద్వారా మంజూరు చేసి ఖాతాదారులకు తెలియకుండానే రూ .48.00 లక్షలు మేరకు విత్ డ్రా చేసుకునియున్నారని
తెలిపారు.
అదేవిధంగా క్రాప్ లోన్ల కొరకు వచ్చిన రైతులకు ఋణాలు మంజూరు కాబడినప్పటికీ వారికి తెలియపరచక ఆయా రుణ మొత్తాలను రూ .11.00 లక్షలు మేరకు విత్ డ్రా చేసుకుని వినియోగించుకునియున్నారని వివరించారు. ఆ ఇరువురు ఉద్యోగులు చేసిన మోసం తెలిసిన అనంతరం బ్యాంక్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ , గుడివాడ సబ్ డివిజన్ వారు జరిపిన విచారణలో పైన పేర్కొన్న ప్రకారం రూ .2.65 కోట్లు మేరకు మోసం జరిగినదని తేల్చినట్టుగా తెలిపారు.
ఎమ్మెల్యే వంశీ చెబుతూ సంఘ సెక్రటరీ, క్యాషియర్ చేసిన మోసపూరిత చర్యల వలన సుమారు 100 మంది బాధితులు అనేక ఇబ్బందులకు గురగుచున్నారని, వారంతా చిన్నకారు రైతులు . కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించుచున్నారని చెప్పారు.
ఆయా కుటుంబాలలో విద్య , వైద్య మరియు వ్యవసాయ అవసరాల కొరకు నగదును సంఘ ఖాతాలలో దాచుకోగా ఆ నగదును మోసగించి సంఘ ఉద్యోగులు దోచుకోవడంతో వారంతా లబోదిబోమని విలపించుచున్నారని తన్నీరు, జిల్లా అధికారుల దృష్టికి తెచ్చారు.
రిజర్వ్ ఫండ్ , సి.జి.ఎఫ్ , బిల్డింగ్ ఫండ్ , బి.డి.ఆర్ మరియు ధాన్యం కొనుగోలు కేంద్రం కమీషన్ ల రూపంలో ఆత్కూరు గ్రామ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం యొక్క నిధులు కేడీసీసీ బ్యాంక్ వద్ద నిల్వ ఉన్నవనీ సదరు నిల్వ నగదు నుండి తక్షణమే బాధితులను ఆదుకోవలసియున్నదనీ విన్నరించారు. దరిమిలా తన్నీరు మాట్లాడుతూ.. సొమ్ము గోల్ మాల్ వ్యవహారంలో జిల్లాస్థాయి అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి బాధితులను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కోపరేటివ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. బాధితులకు కచ్చితంగా న్యాయం జరిగి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కో-ఆపరేటివ్ డిఆర్ విజయలక్ష్మి, జిల్లా బ్యాంక్ జిఎం రంగబాబు, ఏజీఎం ఎం శ్రీనివాసరావు, డిపిఓ ఫణి కుమార్, ఆత్కూరు గ్రామ మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు చిట్టిబాబు పాల్గొన్నారు.