SAKSHITHA NEWS

జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి…… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
సాక్షిత వనపర్తి
సమాజంలోని సమస్యలను వెలికితీయడంలో జర్నలిస్టులదే కీలక పాత్ర అని, అటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్యం పై శ్రద్ధ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.

     మంగళవారం టీయూడబ్ల్యూజే ( ఐజేయు) ఆధ్వర్యంలో  చిట్యాల గ్రామ శివారులోని దేశినేని శ్యామలమ్మ ఫంక్షన్ హాల్లో  మెడికోవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వారి సహకారంతో జిల్లాలోని జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టీయూడబ్ల్యూజే (ఐజెయూ) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య పరీక్షలను ప్రారంభించారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ఎన్నో సమస్యల్ని వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారం దిశగా చొరవ చూపుతారని చెప్పారు. మన దేశంలో ఎంతోమంది గొప్ప జర్నలిస్టులు ఉన్నారని, పెద్ద పెద్ద కుంభకోణాలను బయట పెట్టడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. జర్నలిస్టులు సమయాభావం లేకుండా పని చేస్తుంటారు కాబట్టి, వారి సొంత ఆరోగ్యం పైన సైతం శ్రద్ధ వహించాలని సూచించారు. 

   ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే డయాబెటిస్, బిపి, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలన్నారు. శారీరకంగా ఫిట్ గా ఉండడం అనేది చాలా ముఖ్యమని, ఎన్ని కోట్లు పెట్టిన కొనలేనిది ఆరోగ్యమేనని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నిత్యం వ్యాయామం చేయడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 

   వ్యాయామం చేయడానికి తీరికలేని పరిస్థితుల్లో కనీసం ఫోన్లో మాట్లాడేటప్పుడు అయినా వాకింగ్ చేయడం ఉత్తమమని సూచించారు. నిత్యం వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధుల్ని దరిచేరనీయకుండా చేయవచ్చని అన్నారు. ఏదైనా వ్యాధిని ముందుగానే గుర్తించడం ఉత్తమం అని, అందులో భాగంగానే జర్నలిస్టులు ఈ మెడికల్ క్యాంపు సద్వినియోగం చేసుకొని తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మేలని చెప్పారు. 

    జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని కలెక్టర్ గుర్తు చేశారు. మిషన్ మధుమేహ, టీబీ స్క్రీనింగ్ వంటి కార్యక్రమాలతో ఉచితంగా ఇంటింటికి వెళ్లి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటన్నిటిని అందరూ సద్వినియోగం చేసుకోవడమే, ప్రజల్లోకి కూడా తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. 

     జిల్లా పౌర సంబంధాల అధికారి పి సీతారాం మాట్లాడుతూ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమని, మంచి జీవన శైలిని పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వం ద్వారా నాణ్యమైన విద్య, వైద్యం అందించబడుతుందని ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లోకి కి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మీడియా వారు సమాజంలో ఉన్న సమస్యల్ని పత్రికల్లో రాయడం ద్వారానే ఉన్నతాధికారులకు విషయాలు తెలుస్తాయని, తద్వారా అవి పరిష్కారం అవుతాయని చెప్పారు. కేవలం సమస్యలే కాకుండా ప్రభుత్వం చేసే మంచిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 

       టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో టి యు డబ్ల్యూ జె ప్రారంభమై 70 సంవత్సరాలు పైగా అవుతోందని, ఉమ్మడి జిల్లాలో 40 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టుల కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందించడమే కాకుండా, వైద్య పరంగా కూడా సహకారం అందించినట్లు చెప్పారు. జిల్లా వైద్యశాఖ అధికారులు కూడా సహాయం కోరిన వెంటనే ఆ సమయంలో స్పందించి జర్నలిస్టులకు ఇంటికి వచ్చి మరి సహాయం చేశారని తెలిపారు. జర్నలిస్టులకు ఎప్పుడు ఆపద వచ్చినా ఆర్థికంగానే కాకుండా అండగా కూడా ఉంటుందని చెప్పారు. 

        వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ వైద్యరంగంపై ప్రత్యేక చొరవ తీసుకొని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. నిత్యం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి జిల్లా వైద్యశాఖను బలోపేతం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న పరీక్షలు ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకుంటే ₹10,000 ఖర్చు అవుతుందని, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉచితంగా వచ్చిన ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

     సీనియర్ జర్నలిస్టు మల్యాల బాలస్వామి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి జర్నలిజం గొప్ప అవకాశం అని భావించి,  వనపర్తి జిల్లాలో దాదాపు 40 ఏళ్ల నుంచి జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, మంచి ఆరోగ్యంతో జర్నలిస్టులు అందరూ ముందుకు వెళ్లాలని సూచించారు. 

   ఈ సందర్భంగా జర్నలిస్టులు వారు యూనియన్ తరపున జిల్లా కలెక్టర్ ను శాలువాతో సన్మానించారు. అదేవిధంగా డిపిఆర్ఓ సీతారాంను, జిల్లా వైద్యశాఖ అధికారి శ్రీనివాసులును, మెడికవర్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ దయా వాస్వనిని శాలువాతో సన్మానించారు. 

   కార్యక్రమ నిర్వహణను ముందుండి నడిపించిన జర్నలిస్టులు బొడ్డుపల్లి లక్ష్మణ్, మన్యం, తైలం అరుణ్ రాజ్ , గంధం దినేష్, కుమార్ లను కలెక్టర్ శాలువాతో సత్కరించారు. 

    కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధులు,  జర్నలిస్టులు, వైద్యశాఖ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app