Is it a crime to have a hat and a beard? Shouldn't there be Muslims in a secular country?
- లౌకిక దేశంలో ముస్లింలు ఉండకూడదా
- ఇస్లాం సంస్కృతిని చిదిమేయకండి
- ముస్లిం సమాజానికి ముస్లింలే సిపాయిలు
- ఇస్లామిక్ సభలో మౌలానా అబ్దుల్ ఖవీ
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
ప్రజాస్వామ్య, లౌకిక దేశమైన భారత్ లో ముస్లింల సంస్కృతి, సంప్రదాయాల పైన ఆంక్షలు విధించడం ఆందోళన కలిగిస్తోందని ఇస్లాం ప్రభోదకుడు హజ్రత్ మౌలానా అబ్దుల్ ఖవీ అన్నారు
. టోపీ, గడ్డం కలిగి ఉన్న వారిని అనుమానపు చూపులు చూడటం.. దేశ ద్రోహుల ముద్ర వేయడం బాధగా ఉందన్నారు. లౌకిక దేశంలో కూడా టోపి, గడ్డం ఉండటం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం నగర శివారు గొల్లగూడెంలోని తాలిముల్ ఇస్లాం మదర్సాలో ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ ఆధ్వర్యంలో జరిగిన ఏడో వార్షికోత్సవ వేడుకలకు మౌలానా అబ్దుల్ ఖవీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మదర్సాలో ఖురాన్ కంఠస్థం పూర్తి చేసిన ఎనిమిది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా మదర్సాలో జరిగిన బహిరంగ సభకు ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అన్ని వైపుల నుంచి ముస్లిం సమాజం పైన దాడి జరుగుతోందని.. వీటి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ముస్లింలపైనే ఉందని అన్నారు.
ముస్లిం సమాజం ఇస్లాం చూపిన మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. ఇంగ్లీషు మీడియం చదువులకు మోజు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నేటి తరం పిల్లలు నిత్యం కుటుంబ కలహాల్లో మునిగి మానవ సంబంధాలు, విలువలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. వీటికి తల్లిదండ్రులే బాధ్యులని.. ఇంగ్లీష్ విద్య కోసం తమ పిల్లలను ఇస్లాం కు దూరం చేయడం వల్లే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇస్లాం బోధనలు.. ఖురాన్ చదవడం.. నేర్చుకోవడం వంటి విషయాలపై ఆసక్తి కలిగించాలని కోరారు. ముస్లిం సమాజానికి ముస్లింలే సిపాయిలుగా మారాలని అబ్దుల్ ఖవీ సూచించారు. ఈ సభలో ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ, సయిద్ అహ్మద్, ముఫ్తీ జలాలుద్దీన్ లు పాల్గొని ప్రసంగించారు.