సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
గృహాలక్షి పథకం క్రింద సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లు, ఎంపిడివో లతో గృహాలక్షి, బిసి బంధు, హరితహారం, బల్క్ భూ సమస్యలు, కళ్యాణలక్ష్మి, శాదిముబారక్, పోడు భూములు, ఎలక్టోరల్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గృహాలక్షి పథకం క్రింద 82280 దరఖాస్తులు అందినట్లు, 50 శాతం వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. క్షేత్ర పరిశీలన పారదర్శకంగా చేయాలన్నారు. ఆర్డీవో లు ఆమోదిత దరఖాస్తుల క్రాస్ చెక్ చేయాలన్నారు. బిసి బంధు క్రింద ఇప్పటికి 1500 మంది లబ్దిదారులకు రూ. లక్ష ఆర్థిక చేయూత అందించినట్లు ఆయన అన్నారు. ఆర్థిక చేయూత చెక్కులు అందించిన లబ్ధిదారులు, నెల రోజుల లోపు యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎంపిడివో లు తనిఖీలు చేసి, యూసీ లు సమర్పించాలన్నారు. తెలంగాణ కు హరితహారం క్రింద ఈ సంవత్సరం లక్ష్యం కు ఇంకనూ 10 లక్షల మొక్కలు నాటాల్సివుందని, లక్ష్యాన్ని ఈ వారంలోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 38 బల్క్ భూ సమస్యలు గుర్తించినట్లు, ఇట్టి సమస్యలకు సంబంధించి, ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలన్నారు. ఇప్పటికే 2400 ఎకరాలకు సంబంధించి బల్క్ సమస్యలు పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు.
18-19సంవత్సరాల వయస్సు గల వారిని ఓటర్లుగా నమోదుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల వారిగా ఇపి రేషియో, జెండర్ రేషియో లపై దృష్టి పెట్టాలన్నారు. బూత్ లెవల్ అధికారుల ఖాళీల్లో క్రొత్తవారి నియామకానికి ప్రతిపాదనలు సమర్పించాలని, క్రొత్త బూత్ లెవల్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని అన్నారు. బూత్ లెవల్ అధికారులు బిఎల్ఓ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని, ఉపయోగించేలా చూడాలన్నారు. నేడు నిర్వహించే నూతన ఓటరు నమోదు అవగాహన ర్యాలీ 5కె రన్‌లో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2 వేల 5 వందల మంది యువ ఓటర్లను భాగస్వామ్యం చేయాలని ఆయన తెలిపారు. 5కె రన్ ర్యాలీ ప్రారంభ ప్రదేశంలో వేదిక ఏర్పాటు చేసి నూతన ఓటరు నమోదుపై సందేశం, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు, మోబైల్ ఈవిఎంల ఏర్పాటు చేయాలన్నారు.
గిరిజనులు, గిరిజనేతరుల పోడు భూముల పట్టాల జారీకి గ్రామ సభలు నిర్వహించి అట్టి భూమి ఎవరి ఆధీనంలో ఉన్నది పహాణినిలో వివరాలను రెవెన్యూ డివిజనల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధరణిలో దరఖాస్తు చేయించాలని ఆయన అన్నారు. నియోజకవర్గాల వారిగా కళ్యాణలక్షీ, శాదిముబారక్ దరఖాస్తులను వెంటనే పరిశీలన చేసి శాసనసభ్యుల ఆమోదంతో ఆర్డీవో లకు పంపాలని, లబ్ధిదారుల జాబితాను వెంటనే తయారు చేయాలని ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జెడ్పి సిఇఓ అప్పారావు, హౌజింగ్ డిఇ కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్లు మదన్ గోపాల్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.