రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు.
తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ప్రారంభించామని, అదనపు డీజీపీ (రైల్వేస్) మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 435 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసినట్లు చెప్పారు.
గతంలో సీఈఐఆర్ పోర్టల్ రాష్ట్ర నోడల్ అధికారిగా పనిచేసిన.. ప్రస్తుత రైల్వే ఏడీజీ మహేశ్ భగవత్ ప్రత్యేక బృందాలు అద్భతంగా పని చేస్తున్నాయన్నారు. నెల రోజుల్లోనే రూ.10 లక్షల విలువైన 150 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.
కేరళలో 5, ఉత్తరప్రదేశ్‌లో, 4, మహారాష్ట్రలో 13, కర్ణాటకలో 11, మధ్యప్రదేశ్‌లో 8, బీహార్‌లో 6, తమిళనాడులో 7, ఆంధ్రప్రదేశ్‌లో 38, తెలంగాణలో 58 మొబైల్ ఫోన్‌లను ప్రత్యేక బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రయాణ సమయంలో ఫుట్‌బోర్డ్ లేదా కిటికీ వైపు కూర్చున్న ప్రయాణికుల నుండి మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్నారు కొందరు. దీంతో అలెర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రైల్వే ప్రయాణికులు తమ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, రైల్వే స్టేషన్లలో ఏదైనా మొబైల్ ఫోన్ దొంగతనం జరిగితే, వెంటనే CEIR పోర్టల్‌లో IMEI నంబర్ల సాయంతో సదరు మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేయాలని అధికారులు సూచించారు. తమ మొబైల్‌లను పోగొట్టుకున్న ప్రయాణికులు CEIR పోర్టల్‌ని ఉపయోగించి IMEIని బ్లాక్ చేయడానికి వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. ఆ తర్వాత ఆ ఫోన్ ట్రాక్ చేయబడుతుందని.. దొరికిన అనంతరం.. అన్‌బ్లాక్ చేసి యజమానులకు అందజేస్తామని చెప్పారు