
నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తు.చ. తప్పక పాటించాలి
- జిల్లా పరిధిలో 20 ఎంసీసీ బృందాల ఏర్పాటు
- ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సమావేశం
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ.. ఎమ్మెల్సీ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఫిబ్రవరి 10 వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయొచ్చన్నారు. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, ఫిబ్రవరి 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని తెలిపారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని, మార్చి 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు.
అప్పటివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని, ఈ నియమావళిని రాజకీయ పార్టీలు తు.చ. తప్పకుండా పాటించాలన్నారు. ఈసీఐ- ఎంసీసీ నియమ నిబంధనలను క్షుణ్నంగా చదివి వివరించారు. ప్రత్యేకంగా 20 ఎంసీసీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరుగుతోందని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరక్కుండా పటిష్ట పర్యవేక్షణ ఉంటుందన్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్‌టీఆర్ జిల్లాలో 45,540 మంది పురుషులు, 32,685 మంది మహిళలు, 13 మంది టీజీ ఓటర్లు మొత్తం 78,238 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఆన్‌లైన్లో వచ్చే ఫారం-18లను క్షుణ్నంగా పరిశీలించి, పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 101 పోలింగ్ స్టేషన్లకు ఆమోదం లభించిందని, అదేవిధంగా ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో వెయ్యి ఓట్లు కంటే ఎక్కువగా ఉన్న సందర్భంలో 11 ఆగ్జలరీ పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు రూపొందించినట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూం:
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించే క్రమంలో కలెక్టరేట్‌లో 0866 – 2575822 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూం పనిచేస్తుందని కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, నోడల్ అధికారి కె.శ్రీనివాసరావు, బి.అనిల్ (టీడీపీ), బి.కిరణ్ (ఐఎన్‌సీ), పి.ఏసుదాస్ (ఐఎన్‌సీ), వై.ఆంజనేయరెడ్డి (వైఎస్ఆర్‌సీపీ), ఎం.వినోద్ కుమార్ (బీఎస్‌పీ), ఇ.సురేష్ కుమార్ (సీపీఎం), బి.శంకర్ (సీపీఐ), బి.రాజా (సీపీఐ), కె.పరమేశ్వరరావు (ఆప్)లతో పాటు కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app