SAKSHITHA NEWS

భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలున్నాయి.

భారత్ జోడో కంటే ముందు కాంగ్రెస్ జోడో చేయాలని సీనియర్లు సెటైర్లు వేస్తున్నారు. సేవ్ గాంధీ ఫ్యామిలీ ఆందోళన్ అని బీజేపీ విమర్శిస్తోంది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ అవసరమేంటో ప్రజలకు తెలియజెబుతూ రాహుల్ యాత్ర సాగే అవకాశం ఉంది.

ఎన్నికల్లో వరుస పరాజయాలు.. కీలక నేతల నిష్క్రమణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు బుధవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఈ యాత్రపై కాంగ్రెస్‌ భారీ ఆశలే పెట్టుకుంది.

వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి, ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న వేళ 3,500 కిలోమీటర్ల పై చిలుకు యాత్ర పార్టీకి పునరుత్తేజం తెస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు ఆశిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. రాహుల్‌ యాత్రతో పార్టీకి ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

ఎనభై ఏళ్ల క్రితం గాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సెప్టెంబర్‌ 7 నుంచే రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర మొదలుపడుతున్నారు. 117 మంది కాంగ్రెస్‌ నాయకులతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకూ ఐదు నెలలు పాదయాత్ర చేస్తారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్‌ చేసేలా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, అసహన రాజకీయాలను ప్రస్తావించడంతోపాటు జీవనోపాధిని నాశనం చేసే ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయం చూపాలని కాంగ్రెస్ భావిస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ వంటి అంశాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లనుంది.

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడంతో పాటు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం, రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బలమైన రాజకీయ ఆకాంక్షతో కాంగ్రెస్‌ ఈ యాత్ర చేపడుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి పరీక్షగా నిలవనున్నాయి. వీటిలో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీతోనే ముఖాముఖి పోరాడాల్సి ఉంది. ముఖ్యంగా గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాల పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలి. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. గుజరాత్‌లో కాంగ్రెస్‌ స్థానాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆక్రమిస్తోంది. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ మళ్లీ గద్దెనెక్కడం అంత సులభం కాదు. అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.

1985 నుంచి ఇప్పటి వరకు 27 ఏళ్లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేనంత భారీ ఓటమిని కాంగ్రెస్‌ 2014, 2019 ఎన్నికల్లోనూ చవిచూసింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టాక జరిగిన ఈ ఎన్నికల్లో 2014లో 19.3 శాతం, 2019లో 19.5 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. ఇక 2014-2022 మధ్య జరిగిన 49 అసెంబ్లీ ఎన్నికలకు గానూ 39 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. కేవలం 4 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచింది. మరో 6 సందర్భాల్లో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. రాహుల్‌ వైఖరిని విమర్శిస్తూ కేంద్ర మాజీ మంత్రులు గులాంనబీ జాద్, కపిల్‌ సిబల్, అశ్వినీ కుమార్, ఎస్‌పీ సింగ్, మురళీ దేవ్‌రాతోపాటు పలువురు సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ను వీడారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ ఏమాత్రం యోగ్యుడు కాదంటూ విమర్శలు వస్తున్నతరుణంలో.. భారత్‌ జోడో యాత్ర ఆయనకు అగ్ని పరీక్షేనని చెప్పక తప్పదు.

రాహుల్ భారత్ జోడో యాత్రకు ముందే ఢిల్లీలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీకి బై చెప్పి.. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి బీహార్లోప్రభుత్వం ఏర్పాటు చేశారు జేడీయూ నేత నితీష్ కుమార్. నితీష్ ఢిల్లీలో రాహుల్ ను కలవడం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం.
వీరిద్దరీ భేటీలో.. బీజేపీయేతర కూటమిపై చర్చ జరిగింది. యూపీఏలో జేడీయూ చేరుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. కాంగ్రెస్, జేడీయూ జాతీయ స్థాయిలో కూడా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష, రాజకీయ వికేంద్రీకరణ లాంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో ప్రజలకు అవగాహన కల్పించనుంది. యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబదూర్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌కు రాహుల్ నివాళి అర్పిస్తారు. ఇక ఆ తర్వాత కన్యాకుమారిలో జరిగే కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. దీంట్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌, చత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ భగేల్ కూడా పాల్గొంటారు. మిలే కదం, జుడే వతన్ ట్యాగ్‌లైన్‌తో యాత్రను నిర్వహిస్తున్నారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3500 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులో ప్రారంభం కానుంది. తర్వాత కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, చంఢీఘడ్ మీదుగా జమ్ము,కశ్మీర్ కు చేరుకుని అక్కడ ముగుస్తుంది. కేవలం ఐదు నెలల వ్యవధిలో ఈ యాత్ర పూర్తి చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన. ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 100 కిలోమీటర్ల మేర.. 4 రోజుల పాటు రాహల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఏయే తేదీలు అనేవి ప్రకటించాల్సి ఉంది. ఏపీలో రెండు లోకసభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందని సమాచారం. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ డీఎంకేతో అధికారం పంచుకుంటున్న తమిళనాడులో కానీ, విపక్ష సీపీఎం అధికారంలో ఉన్న కేరళలో అడ్డంకులు ఉండకపోవచ్చు. అయితే ఏపీకి వచ్చే సరికి మాత్రం వైసీపీ అధినేత, సీఎం జగన్ అనుమతిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. రాహుల్ గాంధీ యాత్ర షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ప్రకటించాక ఏపీ ప్రభుత్వం అనుమతి కోరే అవకాశముంది. అప్పుడు జగన్ ఎలా స్పందిస్తారన్నది కీలకంగా మారింది.

వచ్చే స్వార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆపార్టీ యువనేత రాహుల్ గాంధీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దేశం మొత్తం తిరిగి ప్రజలకు పార్టీని మరింత చేరవచేసేందుకు ఆయన భారత్ జోడో పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈయాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా 150 రోజులలో 3,500 కిలో మీటర్లు కొనసాగనుంది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. భారత్ జోడో యాత్రని సేవ్ గాంధీ ఫ్యామిలీ ఆందోళన్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. దేశాన్ని ఏకంగా ఉంచేందుకు సుదీర్ఘ పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఈ యాత్ర.. తనకో తపస్సులాంటిదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఇప్పటికే భారత్ జోడో యాత్ర గీతాన్ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రధాని మన్ కీ బాత్ పై తీవ్ర విమర్శలు చేసింది. మన్‌కీ బాత్‌లా తమది వన్‌వే ప్రోగ్రామ్‌ కాదని.. ప్రజల గోడు వినే యాత్ర అని ప్రకటించింది. భారత్‌ జోడో యాత్రలో సుదీర్ఘ ప్రసంగాలు, డ్రామాలు, టెలీప్రాంప్టర్లు ఉండవని తెలిపింది. ప్రజల గోడు విని వారి డిమాండ్లను ఢిల్లీకి చేర్చడమే ఈ యాత్ర ఉద్దేశమని పేర్కొన్నారు కాంగ్రెస్ నేతలు. మీదో అడుగు, మాదో అడుగుతో దేశాన్ని కలుపుదాం అనే నినాదంతో యాత్ర నిర్వహిస్తారు.ఆర్థికంగా, సామాజికంగా దేశం విడిపోతోందని, రాష్ట్రాల హక్కులు హరించుకుపోతున్నాయని.. అందుకే ఆ యాత్ర చేపడుతున్నామన్నారు కాంగ్రెస్ నేతలు.

రోజూ రెండు భాగాలుగా యాత్ర కొనసాగుతుంది. ఉదయం 7 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. రోజూ సగటున 22 నుంచి 23 కిలోమీటర్ల చొప్పున మొత్తం 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. ప్రధాన యాత్రకు అనుబంధంగా ఆయా రాష్ట్రాల్లో చిన్న జోడో యాత్రలు నిర్వహిస్తారు. భారత్‌ జోడో యాత్ర కోసం టీపీసీసీ కసరత్తు చేస్తోంది. అక్టోబర్‌ 24 నుంచి దాదాపు 15 రోజులు తెలంగాణలో యాత్ర నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందిస్తోంది. ప్రతిరోజూ ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నేతలతో రాహుల్‌ గాంధీ సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలుండగా, ఆ17 స్థానాల పరిధిలోని ముఖ్య నాయకులు, అసెంబ్లీ ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో రాహుల్‌ భేటీ అయి.. పార్టీ బలోపేతం, రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.

రాహుల్‌ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించే చోట భారీ స్థాయిలో స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలను టీపీసీసీ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేలా ఈ కార్యక్రమాలుంటాయి. 5 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలకు కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్లాన్‌ చేస్తోంది. రాహుల్‌తో కలిసి దేశ వ్యాప్తంగా నడిచే 118 మంది బృందంతో పాటు.. రాష్ట్రంలోని 100 మంది నాయకులు కూడా తెలంగాణలో ఆయనతో కలిసి నడుస్తారు. ఈ 100 మంది బృందంలో ఎవరెవరు ఉండాలన్న దానిపై టీపీసీసీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరెవరు యాత్రలో పాల్గొనాలనే దానిపై ముందుగానే నిర్ణయం తీసుకుని వారికి పాస్‌లు కూడా జారీ చేయనున్నట్టు సమాచారం.

భారత్ జోడో యాత్ర మొత్తం 12 రోజులపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల మీదుగా సుమారు 300-350 కిలోమీటర్ల మేర సాగనుంది. రాయచూర్‌ మీదుగా నారాయణపేట నియోజకవర్గంలోకి రానున్న రాహుల్‌ యాత్ర కొడంగల్, పరిగి, వికారాబాద్, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్‌ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. బిచ్కుంద, మద్నూరు మీదుగా మహారాష్ట్రలోని డిగ్లూర్‌కు వెళ్లేలా రూట్ మ్యాప్ తయారుచేశారు. ఒకవేళ ఏదైనా మార్పులు జరిగితే జుక్కల్‌లో ప్రవేశించిన తర్వాత బాన్సువాడ, బోధన్‌ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే అవకాశాలున్నాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్. నాన్ సీరియస్ నేత. బాధ్యతల నుంచి పారిపోయేవాడు లాంటి విమర్శలతో విసిగిపోయిన రాహుల్.. పాదయాత్రకు పచ్చజెండా ఊపడం అనూహ్య పరిణామమనే చెప్పాలి. పాదయాత్ర మొదలైన కొద్దిరోజులకే ప్రజా స్పందన ఎలా ఉందో తెలిసిపోతుందనేది కాంగ్రెస్ అభిప్రాయం. పైగా దీన్ని రాజకీయ యాత్రగా కాకుండా.. దేశం కోసం చేస్తున్న కార్యక్రమంగా ప్రొజెక్ట్ చేయడం.. తటస్థ ఓటర్లను కూడా ఆకర్షించే అంశంగా చూస్తున్నారు.

రెండు దశాబ్దాల ప్రజాజీవితం కంప్లీట్ చేసుకున్న రాహుల్.. ఎన్నికల సమయంలో కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం లేదనే అపవాదు ఎదుర్కుంటున్నారు. ఈ విమర్శలన్నింటికీ చెక్ పెట్టేలా.. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే.. పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. గాంధీ కుటుంబం ఇంటికే పరిమితం అవుతుందని ఆరోపణలు అబద్దమని నిరూపిస్తూ.. ప్రజల్లో కలసి పోయ.. కార్యకర్తలకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చేలా యాత్రను ప్లాన్ చేశారు. పార్టీలో దశాబ్దాల తరబడి పదవులు అనుభవించిన నేతలు.. కష్టకాలంలో కాంగ్రెస్ ను వీడటంపై క్యాడర్లో కోపం ఉంది. సీనియర్లతో పాటు జూనియర్లను కూడా రాహుల్ కలిసికట్టుగా ఉంచలేకపోతున్నారనే అభిప్రాయాలున్నాయి. అందుకే క్షేత్రస్థాయి నుంచి ఆపరేషన్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు రాహుల్. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరించాలని ఫిక్సయ్యారు.

యాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ నేతలు ఎంత వ్యూహత్మకంగా ప్లాన్ చేశారో అర్థమవుతోంది. యాత్రను తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభిస్తున్నా ఆ రాష్ట్రంలో పాదయాత్ర పెద్దగా కొనసాగదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో అధికారంలో వున్నది కాంగ్రెస్ మిత్రపక్షమైన డిఎంకే. దానికితోడు తమిళనాడులో ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ సీట్ల సంఖ్యను పెంచుకునే పరిస్థితి లేదు. సో ఆ రాష్ట్రంలో నడిచినా పెద్దగా ఉపయోగం లేదు. అందుకే కన్యాకుమారిలో ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్ర మూడో రోజునే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కేరళ రాష్ట్రం భవిష్యత్తులో ముఖ్యమైనది. కేరళలో ఓసారి కాంగ్రెస్ సారథ్యంలోని యుడీఎఫ్ అధికారంలోకి వస్తే.. తర్వాత టెర్మ్ వామపక్షాల సారథ్యంలోని ఎల్డీఎఫ్ అధికారంలోకి రావడం గతంలో రివాజుగా వుండింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తూ ఎల్డీఎఫ్ రెండోసారి అధికారం చేపట్టింది. పినరయి విజయన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కేరళలో పాగావేయడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ముఖ్యం. అందుకే కేరళలో త్రివేండ్రమ్, కచ్చి, నీలంబూర్ వంటి ప్రాంతాలను కలుపుతూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ ప్రాంతాన్ని స్పృశిస్తూ రాహుల్ పాదయాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత మైసూర్ గుండా రాహుల్ యాత్ర కర్నాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. బీజేపీ దక్షిణాది దండయాత్రలో భాగంగా ముందుగా కర్నాటకలోనే కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టింది. కర్నాటక అసెంబ్లీకి మొన్నామధ్య జరిగిన ఎన్నికల తర్వాత జెడిఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే, బీజేపీ చాణక్యనీతితో కర్నాటకలో రాజ్యాధికారాన్ని లాగేసుకుంది. కాంగ్రెస్ పార్టీని చీల్చి దారుణంగా దెబ్బకొట్టింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే కర్నాటకలో కాంగ్రెస్ మరింతగా బలపడాల్సిన అవసరం వుంది. అందుకే కర్నాటకలోని బీజీపీ ప్రాబల్య ప్రాంతాలను టచ్ చేస్తూ రాహుల్ పాదయాత్రను డిజైన్ చేశారు. మైసూరు, బళ్ళారి, రాయచూరు వంటి ప్రాంతాలలో భారత్ జోడో యాత్ర కొనసాగబోతోంది. ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీన పరిస్థితి దృష్ట్యా ఆ రాష్ట్రంలో యాత్ర పెద్దగా కొనసాగదు. అనంతపురంలో ఎంటరయి.. కర్నూలులోని ఆలూరు గుండా తిరిగి కర్నాటకలోకి రాహుల్ వెళ్ళిపోతారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తన సొంత జిల్లాలో రాహుల్ పాదయాత్ర జరిపేలా చూసుకున్నట్లు భావిస్తున్నారు. ఇక కర్నాటకలోని రాయచూరు తర్వాత తెలంగాణలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది.

ఇక నారాయణపేట జిల్లా మక్తల్ దగ్గర తెలంగాణలోకి రాహుల్ ఎంటరవుతారు. ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో మారిన సమీకరణల దృష్ట్యా ఆ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర కీలకం కాబోతోంది. నాందేడ్, జల్గావ్ మీదుగా ప్రయాణించే రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మీదుగా వెళ్ళి రాజస్థాన్‌లోని కోట, దౌసా, ఆళ్వార్ ప్రాంతాల వైపు వెళుతుంది. ఆ తర్వాత యుపీలోని బులంద్ షహర్, న్యూఢిల్లీ మీదుగా హర్యానా చేరుతుంది. హర్యానాలోని అంబాలా మీదుగా నడవనున్న రాహుల్ గాంధీ.. పఠాన్ కోట్, జమ్మూల మీదుగా వెళ్ళి శ్రీనగర్ చేరుకుంటారు. శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్రకు ముగింపు పలుకుతారు.

ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు పాలించే రాష్ట్రాలపైనే కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టినట్లు అర్థం చేసుకోవచ్చు. కేరళలో ఎల్డీఎఫ్, కర్నాటకలో బీజేపీ, ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, మహారాష్ట్రలో బీజేపీ, శివసేన రెబల్ వర్గం, యుపీ, హర్యానాలలో బీజేపీ, పంజాబ్‌, ఢిల్లీలలో ఆమ్ ఆద్మీ పార్టీలు అధికారంలో వున్నాయి. యాత్ర కొనసాగనున్న రూట్‌లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం డిఎంకే, రాజస్తాన్‌లలో స్వయంగా కాంగ్రెస్ పార్టీలు అధికారంలో వున్నాయి. మొత్తమ్మీద పన్నెండు రాష్ట్రాల గుండా పాదయాత్ర కొనసాగనుండగా అందులో ఒకటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. ఈ లెక్కన రాజకీయంగా తాము బలపడాల్సిన రాష్ట్రాలను గుర్తించి, వాటి గుండా యాత్ర కొనసాగేలా వ్యూహరచన చేసింది కాంగ్రెస్.

దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి సుదీర్ఘ పాదయాత్ర చేయడం తప్పకుండా సెన్సేషన్ అవుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది. పార్టీ కంచుకోటల్ని కాపాడుకోవడం, పెట్టనికోటల్లాంటి నియోజకవర్గాల్లో బలం పెంచుకోవడం, బీజేపీపై అసంతృప్తిని కాంగ్రెస్ వైపు మళ్లించడం లాంటి బహుముఖ లక్ష్యాలతో రాహుల్ పాదయాత్ర తలపెట్టారు. వ్యక్తిగా రాహుల్ ఏంటి.. రాజకీయ నేతగా ఆయన రూపాంతరం ఎలా జరిగింది.. దేశానికి సంబంధించి ఆయన ఆలోచనలేంటి అనేది పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు గాంధీ కుటుంబం ఇమేజ్ కూడా కచ్చితంగా మారే ఛాన్స్ ఉంది. రాహుల్ అంటే బీజేపీ చెబుతున్నట్టుగా యువరాజు కాదు.. మనలో ఒకడు అని ప్రజలు అనుకుంటే.. టార్గెట్ రీచ్ అయినట్టే అనేది కాంగ్రెస్ ప్లాన్. ఒక్కసారి అపోహపు మబ్బుతెరలు వీడిపోతే.. కాంగ్రెస్ కు ఎదురుండదని ఆ పార్టీ భావిస్తోంది. పాదయాత్ర విజయవంతమైతే.. మోడీకి దీటైన నేతగా రాహుల్ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు కూడా మెరుగుపడుతాయి. ఈ ఇమేజ్ పార్టీకి దేశవ్యాప్తంగా వర్కవుట్ అవుతుందని క్యాడర్ కూడా నమ్ముతోంది.


SAKSHITHA NEWS