SAKSHITHA NEWS

దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్‌ రైస్‌’ (Bharat rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

₹29కే కేజీ భారత్‌ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(NAFED), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF), కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు.ఈ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌ వేదికల్లో విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా.. భారత్‌ రైస్‌కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.


SAKSHITHA NEWS