బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలి : సిహెచ్.శిరోమణి పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Spread the love

సాక్షిత సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులను యుద్ధ ప్రాతిపదికన మూసివేయాలని పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. శిరోమణి డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో పిఓడబ్ల్యు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అద్యక్షులు మారసాని చంద్రకళ అద్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బెల్ట్ షాపులను మూసివేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు కానీ బెల్ట్ షాపులను రద్దు చేయకుండ నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నారు.గత టిఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వంలోనూ బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి అన్నారు.

మంచినీళ్లు దొరకటం లేదు గాని ప్రతి గ్రామంలో నాటు సారా,బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతుంది అన్నారు. ఈ మద్యం షాపుల వల్ల సంసారాలు ఆగమై కుటుంబాలు అప్పులపాలై సామాన్యలు బతికే పరిస్థితి లేకుండా పోతుంది అన్నారు. మద్యం షాపుల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూస్తున్నారు కాని ప్రజల జీవన స్థితిగతులను, వారి ఆరోగ్య విషయాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు.ఇలాగే నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణగా మారి జీవితాలు ఆగమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లోఇచ్చిన హామీ మేరకు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో నాటు సారాను నిషేధించి,బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) తరఫున బెల్ట్ షాపులను ఎత్తేసే వరకు ఉద్యమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, ఉపాధ్యక్షురాలు సూరo రేణుక , కోశాధికారి మోటకట్ల జయమ్మ, దొంతమల్ల విజయ పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page