అంబ్కేదర్‌ బాట.. కేసీఆర్‌ మాట.. దళితోద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు

Spread the love

ఆబేద్కర్‌ ఆశయాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలుచేసి చూపిస్తున్నారు. బాబాసాహెబ్‌ మాటలను పలు సందర్భాల్లో ఉటంకించడంతోపాటు ఆయన కలలను సైతం సాకారం చేస్తున్నారు.

దళితోద్ధరణకు ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు తీసుకొచ్చి అట్టడుగువర్గాలకు అందజేస్తున్నారు. దళితుల పట్ల సమాజ దృక్పథం మారేలా, గుణాత్మక మార్పునకు సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారు.
బాబాసాహెబ్‌ ఆశయాలు.. తెలంగాణలో అమలు
అంబేద్కర్‌ ఆశయాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలుచేసి చూపిస్తున్నారు. బాబాసాహెబ్‌ మాటలను పలు సందర్భాల్లో ఉటంకించడంతోపాటు ఆయన కలలను సైతం సాకారం చేస్తున్నారు. దళితోద్ధరణకు ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు తీసుకొచ్చి అట్టడుగువర్గాలకు అందజేస్తున్నారు. దళితుల పట్ల సమాజ దృక్పథం మారేలా, గుణాత్మక మార్పునకు సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారు. తరతరాలుగా కులవివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసమే దళితబంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చారు. యజమానులుగా, వ్యాపారులుగా కొత్త జీవితం ప్రసాదించారు. బాబాసాహెబ్‌ బాటలో నడుస్తూ బడుగు బలహీనవర్గాల బంగారు భవిష్యత్తుకు బాటలు పరుస్తున్నారు కేసీఆర్‌. వివిధ సందర్భాలలో దళితుల సంక్షేమంపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు..దళిత సాధికారతలో దేశానికి తెలంగాణ ఆదర్శం

– ఈశ్వరీబాయి జయంతి సందేశంలో (01-12-2022)

సమాజంలో జనాభా ఎక్కువగా ఉండి, అవకాశాలు తక్కువగా ఉండి సతమతమవుతున్న జాతి దళితజాతి. సామాజిక వివక్ష వల్లే ఇవాళ ఈ పరిస్థితి. సమాజం చేసిన ఈ తప్పును సమాజమే సరిదిద్దుకోవాలి. అనేక తరాల నుంచి, అనేక బాధలు పడి కుల వివక్షకు, వెలికి గురై గ్రామాల బయటే ఉంచబడింది.

తరతరాలుగా కులవివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసమే దళితబంధు పథకం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయాలకు అతీతంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. మన దేశంలో ఈ తరహా ప్రయత్నం మునుపెన్నడూ జరుగలేదు.
– అసెంబ్లీలో మాట్లాడుతూ.. (05-10-2021)

దళితుల పట్ల సమాజ దృక్పథం మారాలి. పోలీసుల ఆలోచనా ధోరణి మారాలి. దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. శాంతి భద్రతలను కాపాడటంలో గుణాత్మక మార్పు సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. వీటిని క్షమించం. లాకప్‌డెత్‌కు కారణమైన వారిపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం.
– దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్‌పై స్పందిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించిన సందర్భంలో.. (25-06-2021)

తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ముఖాలు వెలిగినప్పుడే, వారి కండ్లలో ఆనందం వెల్లివిరిసినప్పుడే, ఈ రాష్ట్రం ఏర్పడినందుకు సార్థకత ఉంటుంది. వారు కూడా ఆత్మగౌరవంతో బతకాలి.
– శాసనసభలో బలహీనవర్గాల సంక్షేమంపై ప్రసంగంలో (07-10-2015)

కాళ్లు, చేతులు మాత్రమే ఆస్తిగా లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. వాళ్లు పైకి రావాలంటే ఎదో ఒక అద్భుతం జరగాలి. వారి సంపద పెంపులో భాగంగా వచ్చిందే మన దళితబంధు. ఈ పథకం మహాయజ్ఞం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసి మెప్పించి అధికారం సాధించి దానిని సద్వినియోగం చేయాలి. అది డెమోక్రసీలో జరుగాల్సిన పని.నేను వందశాతం చెప్తున్నా.. ఎన్నో రాష్ర్టాలు, దేశాలు కొన్నాళ్లు పోతే ఇక్కడకి వచ్చి నేర్చుకుని పోతాయి.
– టీఆర్‌ఎస్‌లో బీజేపీ నేతల చేరిక సందర్భంగా.. (30-07-2021)

దళితుల సమస్యలు ఒక్క తీరుగా లేవు. వారి జీవన పరిస్థితులను బట్టి, గ్రామాల్లో ఒకరకంగా, పట్టణాల్లో మరో రకంగా ఉన్నాయి. సెమీ అర్బన్‌లో ఒక తీరు సమస్యలు ఉంటే, కార్పొరేషన్‌ స్థాయిలో మరో తీరుగా ఉన్నాయి. హైదరాబాద్‌ వంటి కాస్మొపాలిటన్‌ నగరాల్లో అయితే పూర్తి భిన్నంగా దళితుల సమస్యలు ఉన్నాయి. వీటిని మేధావులు అర్థం చేసుకొని, ఏ ప్రాంతంలోని సమస్యలకు ఏవిధమైన విధానాన్ని అనుసరించాలో ఆలోచించాలి.
– దళిత సాధికారత పథకం ప్రకటించిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చిన దళిత మేధావులతో సీఎం కేసీఆర్‌ (27-06-2021)

ఫూలే, అంబేద్కర్‌ ఆలోచనల్లోంచి పుట్టిందే దళితబంధు. భవిష్యత్తులో ఈ పథకం దేశానికి దారి చూపుతుంది. దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి.
– స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి (15-08-2021)

దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతి ఒక్కరిని కలచివేసే విషయం. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఏ ఊరుకు వెళ్లినా సామాజికంగా, ఆర్థికంగా పీడితవర్గాలు ఎవరంటే వారు దళితులే. ఇక నుంచి దళితుల బాధలు పోవాలి. మేము కూడా పురోగమించగలం అనే ఆత్మైస్థెర్యంతో దళిత సమాజం ముందుకుపోవాలి. దళితులకు సామాజిక ఆర్థిక బాధలు తొలగించేందుకు దశలవారీగా కార్యాచరణ అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.

– దళిత సాధికారత పథకంపై ప్రగతిభవన్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో (27-06-2021)

దళిత జాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజం ప్రధాన బాధ్యత, అది ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రాథమిక విధి. అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవసేవ. మానవసేవయే మాధవ సేవ అని మహాత్ముడు ఏనాడో చెప్పారు. ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజమంతా అండగా నిలవాలి. ఈర్ష్య, అసూయలకు తావు ఇవ్వకుండా ఒక్క తాటిపైకి వచ్చి దళిత సమాజానికి నమ్మకం ఇవ్వాలి. కులం పేరిట నిర్మించిన ఇనుప గోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి. దళితజాతి సమగ్ర వికాసానికి ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగబోయేది ఇంకో ఎత్తు అనేలా ప్రభుత్వం దళిత ఉద్యమానికి నాంది పలుకుతున్నది.
– స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండలో ప్రజలను ఉద్దేశించి.. (15-08-2021)

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page