ఎంతో భవిష్యత్ కలిగిన కంటోన్మెంట్ MLA లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందడం చాలా బాధాకరమని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించిన విషయం తెలుసుకున్న ఆయన తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె పార్దీవ దేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తీసుకొస్తున్న విషయం తెలుసుకొని ఆయన గాంధీ హాస్పిటల్ కు చేరుకున్నారు.
అక్కడ లాస్య తల్లి, సోదరి లను ఓదార్చి తన ప్రగాడ సంతాపం, సానుభూతిని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాస్య తండ్రి సాయన్న కూడా కంటోన్మెంట్ నుండి MLA గా సుదీర్ఘకాలం పాటు ప్రాతినిద్యం వహించారని వివరించారు. ఆయన గత సంవత్సరం అనారోగ్యంతో మరణించగా, BRS పార్టీ అధినేత KCR లాస్య కు MLA గా పోటీ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలిపించారని తెలిపారు. తండ్రి సాయన్న మరణించి ఇటీవలనే ఏడాది గడిచిందని, ఈ లోగానే రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించిందనే ఊహించని విధంగా విషాదకరమైన వార్తను వినాల్సి వచ్చిందని, ఇది అత్యంత భాధాకరం అని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి మనోదైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని కోరుతున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కార్ఖానా లోని లాస్య నందిత నివాసానికి పార్దీవ దేహం వెంట మాజీమంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి వెళ్ళారు. పార్దీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.