People should take advantage of the light of the eye
కంటి వెలుగు ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సాక్షిత సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని జంట నగరాల ప్రజలు, సికింద్రాబాద్ నియోజకవర్గ పౌరులు సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 18 వ తేది నుంచి చేపట్ట నున్న కంటి వెలుగు కార్యక్రమం తీరు తెన్నుల పై గురువారం సితఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీత, శ్రీమతి కంది శైలజ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి, తెరస యువ నేత తీగుల్ల కిరణ్ గౌడ్, నేతలు మోతే శోభన్ రెడ్డి, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్, జీ హెచ్ ఎం సీ డిప్యూటీ కమీషనర్ శ్రీ దశరద్, వైద్యాధికారులు డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ సక్కు బాయి, ప్రాజెక్ట్ అధికారి శ్రీ శ్రీనాథ్ లతో పాటు అధికారులు, నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో శ్రీ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 18 వ తేది నుంచి జూన్ 30 తేది వరకు కొనసాగుతుందని తెలిపారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో 152 కేంద్రాల్లో 45.38 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారని, రీడింగ్ సమస్యలు ఉన్న వారికి వెంటనే కంటి అద్దాలు అందిస్తారని అయన వివరించారు, సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో గతంలో కంటి వెలుగు కార్యక్రమాల్లో 12 వేల మందికి పరీక్షలు నిర్వహించారు. సుమారు వంద మందికి అప్పట్లో శస్త్ర చికిత్సలు నిర్వహించారని తెలిపారు.
తాజాగా సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 9 సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని, కనీసం 2.94 లక్షల మందికి ఉచితంగా పరిక్షలు నిర్వహించాలని లక్షంగా నిర్ధారించుకున్నామని సెలవు రోజులు మినహా ఒక్కోరోజు 200 మందికి స్క్రీనింగ్ నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైతే వెంటనే కంటి అద్దాలను ఉచితంగా అందిస్తారని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బోయ బస్తీ కమ్యూనిటీ హాల్ (అడ్డగుట్ట), BJR కమ్యూనిటీ హాల్ (అడ్డగుట్ట), ప్రొఫెసర్ జయ శంకర్ స్టేడియం (తార్నాక డివిజన్)నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ (తార్నాక), చింత బావి కమ్యూనిటీ హాల్ (మెట్టుగూడ), ఉప్పరి బస్తి కమ్యూనిటీ హాల్ (సీతాఫల మండీ), UPHC – మహమ్మద్ గూడా (సితాఫలమండీ), UPHC కుట్టి వెల్లోడి (సితఫలమండీ), బౌద్దనగర్ కమ్యూనిటీ హాల్ (బౌద్దనగర్) ప్రాంగణాలల్లో కంటి వెలుగు శిబిరాలను తొలుత ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.