సిద్దిపేట : పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి పథకం( Kalyan Lakshmi). నాడు కేసీఆర్(KCR) కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
సిద్దిపేట (Siddipet) క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 59జీవో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
గతంలో కేసీఆర్ ఎన్నికల హామలో ఈ పథకాలు లేకున్నా మానవీయ కోణంలో స్పందించి ఈ పథకాలను అమలు చేసారన్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు, తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మేం ఎన్నికల్లో చెప్పని పథకాన్ని అమలు చేసాం. మీరు ఎన్నికల్లో మాట ఇచ్చారు. మాట తప్పకుండా తులం బంగారం ఇవ్వాలన్నారు. అలాగే 59జీవో కింద పట్టా తీసుకోబోతున్న వారు మీ ఆస్తికి మీరు హక్కు దారులని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతామన్నారు.