దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ముఖ్యంగా జూన్లో రానున్న నైరుతి రుతుపవనాలు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మెరుగ్గా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. గత సీజన్లో పడిన వర్షపాతం కంటే కూడా వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంటున్నారు నిపుణులు.
పసిఫిక్ మహాసముద్రంలో లాస్ట్ ఇయర్ నుంచి కొనసాగుతున్న ఎల్ నినో బలహీనపడి జూన్ నాటికి పూర్తిస్థాయిలో బలహీనపడుతుందని.. నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత లానినా ఏర్పడుతుందని దేశీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని వాతావరణ సంస్థలు చేపట్టిన సర్వేలో తెలిసింది. ఈ ఎల్ నినో ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ప్రభావం ఉంటుందని.. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పాటు, వర్షపాతం తక్కువగా నమోదు కావడం, కొన్నిచోట్ల అనుకోని విపత్తులు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భారత ఉపఖండంపై ఈ ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. కానీ ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే ఏప్రిల్ నుంచి ఎల్ నినో బలహీనపడి ఆగష్టు నాటికి లానినా బలపడుతుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఈ విషయాన్ని తెలిపారు.
లాస్ట్ ఇయర్ నైరుతి సివిజన్లో సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లకు.. 820 మిల్లీమీటర్లుగా నమోదయిందని ఈసారి అంతకంటే మెరుగ్గా వర్షాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎల్ నినో తీవ్రత నేపథ్యంలో లాస్ట్ ఇయర్ సమ్మర్ కంటే ఈ ఇయర్ సమ్మర్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. మొత్తానికి నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి వచ్చి మంచి వర్షాన్ని ఇచ్చినప్పటికీ వచ్చే వేసవి మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని దానితోపాటు తుఫాన్ల తీవ్రతతో కుంభవృష్టి వర్షాలకు ఛాన్స్ ఎక్కువగా ఉంది అని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.