చెప్పింది చేసే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లీ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గ BRS పార్టీ సర్వసభ్య సమావేశానికి నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా దివంగత MLA సాయన్న చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ BRS పార్టీ మేనిఫెస్టో ను చూసి ప్రతిపక్ష పార్టీల మైండ్ బ్లాక్ అయిపోయిందని అన్నారు.
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధరను 1200 రూపాయలకు పెంచితే 400 రూపాయలకే ప్రభుత్వం ఇస్తుందని ముఖ్యమంత్రి మేనిఫెస్టో ద్వారా వెల్లడించారని చెప్పారు. అదేవిధంగా రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని అన్నారు. గతంలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన హేమా హేమీలు చేయలేని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహకారంతో సాయన్న చేశారని తెలిపారు. గతంలో కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు 15 రోజులకు ఒకసారి త్రాగునీరు సరఫరా జరిగేదని, సాయన్న, నాటి బోర్డు సభ్యులు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి సమస్యను తీసుకొచ్చి GHMC లో మాదిరిగా నీటి సరఫరా జరిగేలా చేయగలిగారని చెప్పారు. అర్హులైన అనేకమందికి కళ్యాణ లక్ష్మి, శాదీముబారాక్, పెన్షన్ లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించేందుకు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు సాయన్న చేసిన సేవలకు గుర్తింపు గానే ఆయన కుమార్తె లాస్య నందితకు MLA గా పోటీ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారని, పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీతో లాస్య నందితను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18 వ తేదీ నుండి నందిత నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభిస్తారని, వచ్చేనెల 9 వ తేదీన భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేస్తారని ఆయన చెప్పారు. తన నియోజకవర్గం సనత్ నగర్ తో సమానంగా కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్దికి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని ప్రకటించారు. కంటోన్మెంట్ లో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, MLA అభ్యర్ధి లాస్య నందిత, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.