పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వహించి నందుకు అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరుగు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 90 వేల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారని, దాదాపు 2 వేల 600 పైగా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ఎం అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. వేసవి కాలంలో పరీక్షలు నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు హాల్ టికెట్ లను వెబ్ సైట్ bse.telangana.gov.in లో ఉంచామని, విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్ లో త్రాగునీరు అందించాలని, అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అన్నారు.

పరీక్షా కేంద్రాలకు ఎవరు సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకం, మోటివేషన్ అందించాలని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ, పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గతంలో ఉన్న 11 పరీక్షలను ప్రస్తుతం 6 పరీక్షలకు కుదించామని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 జరుగుతాయని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు జరుగుతుందని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో 16,873 మంది 10వ తరగతి విద్యార్థులు, 443 మంది ప్రయివేటు విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, 103 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా బాధ్యతలను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. మాలతి, ఎస్బి ఏసీపీ ప్రసన్న కుమార్, మిషన్ భగీరథ ఇఇ పుష్పాలత, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, పోస్టల్, విద్యుత్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page