వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల జీవో: సీఎం కేసీఆర్

Spread the love

10 percent reservation for tribals within a week: CM KCR

KCR: వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల జీవో: సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ, బంజారా భవన్‌లు వేదికలు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ’కు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో మేథోమధనం జరగాలని సూచించారు.
”గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 5.. 6శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనులకు రిజర్వేషన్లు 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కేంద్రానికి పంపి ఏడేళ్లు గడిచినా ఎందుకు పట్టించుకోవడంలేదు. ప్రధాని, హోం మంత్రిని అడుగుతున్నా..ఎందుకు తొక్కిపెడుతున్నారు. చేతులు జోడించి తెలంగాణ గడ్డపై నుంచి ప్రధానిని అభ్యర్థిస్తున్నా.. రాష్ట్రపతి ముద్ర కొట్టించి పంపిస్తే మేం జీవో విడుదల చేస్తాం. మాకు వచ్చే న్యాయమైన హక్కునే కోరుతున్నాం. ఎనిమిదేళ్లలో కేంద్రం ఒక్క మంచి పని చేసిందా? ఎన్‌పీఏల పేరుతో రూ.లక్షలకోట్లు దోచిపెడుతున్నారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ మరో కల్లోలానికి గురికావొద్దని కోరుతున్నా. గిరిజన పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తోంది. తెలంగాణ సమాజం అంతా ఐకమత్యంగా ఉండాలి.రిజర్వేషన్లపై కేంద్రానికి మొరపెట్టుకుని విసిగి వేసారిపోయాం. రాబోయే వారం రోజుల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల జీవోను అమలు చేస్తాం. మోదీజీ.. ఆ జీవోను గౌరవించి అమలు చేయిస్తావా? ఉరితాడు చేసుకుంటావా? తేల్చుకోవాలి. 10శాతం రిజర్వేషన్లు రాష్ట్రమే అమలు చేసుకుంటుంది.
భూమి లేని గిరిజనులకు పోడు భూములు పంచుతాం. దళితబంధు అమలు చేస్తున్న విధంగానే .. గిరిజన బంధు ద్వారా రూ.10లక్షల ఆర్థిక సాయం చేస్తాం. వెసులు బాటు చూసుకుని ఆ కార్యక్రమం కూడా మొదలుపెడతాం. సంపద పెంచడం.. అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. గిరిజన గురుకులాలలను మరిన్ని పెంచుతాం. ఈ ఏడాదే గిరిజన బాలికలకు గురుకులాలు తెచ్చే యోచన చేస్తున్నాం. భారతజాతి ప్రతినిధులుగా గిరిజన బిడ్డలు ఎదగాలి. ఈదేశంలో అణచివేతకు గురైన జాతుల కోసం తన జీవితాన్నే దారపోసిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌. ఆయన్ను సమున్నతంగా గౌరవించే విధంగా తెలంగాణ ప్రధాన పరిపాలనా భవనమైన సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నాం. అన్ని వర్గాలను, సంస్కృతులను గౌరవించుకుంటూ ఆనందంగా ఉన్న ఈ సమాజం శాంతియుతంగా ముందుకు సాగాలనేదే నా కోరిక. జాతీయ పార్టీ ఏర్పాటుపై మద్దతిస్తామని మహారాష్ట్ర నాయకులు చెప్పారు. మన సంక్షేమ కార్యక్రమాలు చూసి పొరుగు రాష్ట్రాలు ప్రభావితమవుతున్నాయి. రైతుల రాజ్యం రావాలి.. దేశం కొత్త పుంతలు తొక్కాలి. తెలంగాణ మాదిరిగా దేశమంతా పొలాల్లో నీరు పారాలి. భారత రాజకీయాలను ప్రభావితం చేయాలి. తెలంగాణ స్ఫూర్తితో విద్వేష రాజకీయాలను పారద్రోలుతాం” అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page