టీడీపీ అధికారంలోకి రాగానే కేతిరెడ్డి కబ్జాలపై ప్రత్యేక విచారణ: లోకేశ్

Spread the love

టీడీపీ అధికారంలోకి రాగానే కేతిరెడ్డి కబ్జాలపై ప్రత్యేక విచారణ: లోకేశ్

ధర్మవరం నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర

ధర్మవరంలో లోకేశ్ ఘనస్వాగతం

పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో భారీగా తరలివచ్చిన శ్రేణులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం ధర్మవరం నియోజకవర్గంలో ప్రవేశించింది.

రాప్తాడు నియోజకవర్గం పైదిండి నుంచి ప్రారంభమైన 57వ రోజు పాదయాత్ర… మధ్యాహ్నం ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

ధర్మవరం ఇన్ చార్జి పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో పెద్దఎత్తున పార్టీనాయకులు, అభిమానులు, ప్రజలు లోకేశ్ కు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. 

తనని చూడటానికి రోడ్ల పైకి వచ్చిన ప్రజల్ని ఓపిగ్గా కలుస్తూ… వారితో ఫోటోలు దిగుతూ సమస్యలు తెలుసుకున్నారు.

ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రావడం లేదని యువకులు ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు వాపోయారు.

వైసీపీ పాలనలో మైనార్టీలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదని మైనారిటీలు చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ…

వైసీపీ పాలనలో అన్ని వర్గాలు బాధితులేనని, ఎవరూ ఆనందంగా ఉండకూడదు అనేది జగన్ కాన్సెప్ట్ అని విమర్శించారు.

నామాల క్రాస్ వద్ద సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు లోకేశ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేయకపోవడంతో రెండేళ్లుగా జీతాలు లేవని ఆవేదన చెందారు.

లోకేశ్ స్పందిస్తూ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్యసాయి మంచినీటి పథకాన్ని దత్తత తీసుకుని మరింత విస్తరిస్తానని, కార్మికుల సేవలు వినియోగిచుకుంటామని చెప్పి ముందుకు సాగారు. 

ధర్మవరంలో నిర్వహించిన యువనేత పాదయాత్రలో వివిధ వర్గాలనుంచి వినతులు వెల్లువెత్తాయి. చేనేత కార్మికులు, బలిజలు, రజకులు, ముస్లింలు, స్వర్ణకారులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు.

చంద్రన్న నేతృత్వంలో రాబోయే టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని చెబుతూ ముందుకు సాగారు.

అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ జరిపిస్తాం!

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని నారా లోకేశ్ ఆరోపించారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని శనివారం మీడియాకి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్ ట్రాక్, గుర్రపు స్వారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. 

ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో ఎర్రగుట్ట పైన ఉన్న 15 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాజేశారని ఆయన ఆరోపించారు.

ఎర్రగుట్టపై భూములను కొట్టేయడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. హైదరాబాదుకు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి సదరు సర్వే నెంబర్ పై రుణాలు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారుచేశారని…

రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వాటిని వేలంలో తమ కుటుంబ సభ్యులు కొన్నట్లు రికార్డులు తయారుచేసి భూములను కొట్టేశారు.

ఎర్రగుట్టపై మరో 5 ఎకరాలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారని… ఇవి పిత్రార్జితంగా ఆమెకు సంక్రమించినట్లు రికార్డుల్లో చూపారన్నారు.

అయితే సదరు కుటుంబ సభ్యురాలిది కర్నూలు జిల్లా అని, ఇక్కడికి ఇచ్చి వివాహం చేశారని వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన మహిళ తండ్రికి ఇక్కడ గుట్టపై భూమి ఎలా సంక్రమించిందని అధికారుల్ని ప్రశ్నించారు. 

ఎర్రగుట్టపై ఉన్న సర్వే నంబర్లకు సంబంధించి రికార్డులు సమర్పించాలని ఆర్.టి.ఐ ద్వారా అడగగా వాటికి సంబంధించిన రికార్డులు లేవంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారని చెప్పారు.

రికార్డుల్లో లేని భూమి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుతో ఎలా నమోదు అయిందని ప్రశ్నించారు. 

అలాగే పోతుల నాగేపల్లి పరిధిలోని 42, 43 సర్వే నెంబర్లలో అసైన్డ్ భూములను రైతులను బెదిరించి లాక్కోవాలని ప్రయత్నించినట్లు ఆరోపించారు.

విషయం ఎస్సీ కమిషన్ వరకు వెళ్లడంతో అప్పటి కలెక్టర్ గంధం చంద్రుడు అడ్డుకున్నారని తెలిపారు. అందుకే ఆయనపై కక్ష పెంచుకుని ఇక్కడి నుంచి బదిలీ చేయించినట్లు ఆరోపించారు.

టీడీపీ అధికారంలోకి రాగానే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ అక్రమాలతో పాటు రాష్ట్రంలోని వైకాపా ఎమ్మెల్యేలందరి అవినీతిపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అభివృద్ధి అంటే రంగులు వేయ‌డం కాదు జ‌గ‌న్!

అభివృద్ధి చేయ‌డం అంటే, ఉన్నవాటికి రంగులు వేయ‌డం కాద‌ని సీఎం జ‌గ‌న్ కు లోకేశ్ చుర‌క‌లంటించారు.

యువ‌గ‌ళం పాద‌యాత్రలో భాగంగా ఆదివారం ధర్మవరం 28వ వార్డులో టిడ్కో గృహాలను లోకేశ్ పరిశీలించారు.

తాను ఇటుగా వ‌స్తున్నాన‌ని, ఆగ‌మేఘాల మీద టిడ్కో ఇళ్లకి రంగులు వేయిస్తున్న వైసీపీ స‌ర్కారు నాలుగేళ్లుగా వీటిని ప‌ట్టించుకోలేద‌న్నారు. 

“ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక ఏడాదికి 5 లక్షల ఇళ్లు కట్టిస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో కట్టింది నాలుగు ఇళ్లు మాత్రమే.

కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని జగన్ మేం కట్టిన ఇళ్లకు మాత్రం సిగ్గులేకుండా రంగులు వేసుకుంటున్నారు.

పేదవాడు కూడా సౌక‌ర్యవంతమైన ఇళ్లలో నివసించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో 5 లక్షల టిడ్కో గృహాలను గ్రౌండింగ్ చేశాం.

ఈ ప్రభుత్వం వచ్చాక కుంటిసాకులతో దాదాపు సగం ఇళ్లను రద్దు చేసింది. గత ప్రభుత్వంలోనే దాదాపు 90 శాతం పూర్తయిన 2.62 లక్షల టిడ్కో ఇళ్లను మిగిలిన 10 శాతం పూర్తి చేసి ఇవ్వకుండా గత నాలుగేళ్లుగా పాడుబెడుతోంది.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ ఇళ్లు పూర్తిచేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

స్టిక్కర్ సీఎం క‌వ‌రింగ్… టిడ్కో ఇళ్లకి క‌ల‌రింగ్!

టిడ్కో గృహాల వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ సీఎం జగన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఇచ్చే ప‌థ‌కాలు క‌ట్ చేయ‌డంతో క‌టింగ్ మాస్టర్, ల‌బ్దిదారుల‌కు అంద‌కుండా స‌వాల‌క్ష అడ్డగోలు నిబంధ‌న‌ల‌తో ఫిటింగ్ మాస్టర్ అనిపించుకుంటున్నాడు.

ఈయన అస‌లు పేరు స్టిక్కర్ మోహ‌న్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో ప‌థ‌కాల‌కు త‌న స్టిక్కర్ వేసుకున్న సీఎం, టీడీపీ హ‌యాంలో క‌ట్టిన‌ టిడ్కో ఇళ్లకూ రంగులు వేసుకున్నారు” అని వివరించారు.

యువగళం పాదయాత్ర వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన దూరం 732.1 కి.మీ.

ఈరోజు నడిచిన దూరం 13.0 కి.మీ.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page