సికింద్రాబాద్ సాక్షిత : సికింద్రాబాద్ బోయ గూడ లోని రైల్వే కళారంగ్ వేదిక ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామక పత్రాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి,అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లోనూ ఎలాంటి రిఫరెన్సులు,రికమండేషన్లకు తావు లేకుండా కేవలం మెరిట్ ద్వారానే ఉద్యోగాలు ఇస్తోందన్నారు.భారత యువత శక్తి సామర్థ్యాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి అపారమైన విశ్వాసం ఉందన్న కేంద్రమంత్రి ఈ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుని దేశాన్ని 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపడమే లక్ష్యంగా అనుసంధానత,మౌలికవసతుల కల్పన, విద్య, వైద్యం,ఫార్మా,రక్షణ,సాంకేతికత ఇలా ప్రతి రంగంలో ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు.
యువతీ యువకులు ఎంతో కష్టపడి పరీక్షలు రాసి ఈ ఉద్యోగాలకు ఎంపికవడం పట్ల వారిని అభినందించిన కేంద్రమంత్రి ఈ విషయంలో తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా అభినందించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభంలో 10 లక్షల మందికి ఏడాదిలోపు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని అనుకున్నప్పటికీఈ సంఖ్య 12 లక్షలకు పెరిగిందన్నారు. వారందరికీ నిర్దేశిత సమయంలో ఉద్యోగాలు అందజేసే దిశగా మోదీ సర్కారు పనిచేస్తోందన్నారు. విద్యతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసేలా, సృజనాత్మకత,పరిశోధన,సాంకేతికతను చిన్నతనం నుంచే ప్రోత్సహించేలా నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కేంద్రమంత్రి వెల్లడించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,అగుమెంటెడ్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతికతకు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.నరేంద్రమోదీ 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో దిగుమతులు తగ్గిమేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదంతో ఉత్పత్తి పెరిగిందని తద్వారా ఎగమతులు గణనీయంగా పెరిగాయని కేంద్రమంత్రి గుర్తుచేశారు,2014లో భారతదేశంలో 5.8 కోట్ల మొబైల్ ఫోన్లు మాత్రమే దేశంలో ఉత్పత్తి అయ్యేవని ఇప్పుడా సంఖ్య 31 కోట్లకు పెరిగి రూ.2,75,000 కోట్ల విలువైన మొబైల్స్ మన దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. విదేశాలకు కూడా మన దగ్గర తయారైన మొబైల్స్ పెద్దమొత్తంలో ఎగుమతి అవుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు.పారదర్శక విధానంతోదేశంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని, ఇందుకోసం భారతీయులంతా ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 71,506 ఉద్యోగాలకు సంబంధించిన నియామకపత్రాల వితరణను రిమోట్ బటన్ నొక్కి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, అడిషనల్ జనరల్ మేనేజర్ ధనుంజయులు,డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్త, రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్టీపీసీ,నాబార్డ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా,ఎన్ఐటీ (వరంగల్), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, నేషనల్ హౌజింగ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.