SAKSHITHA NEWS

ఎమ్మెల్యే చెవిరెడ్డికి..

  • “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం
  • అవార్డ్ అందజేసిన సంస్థ ప్రతినిధులు

…….

సాక్షిత, తిరుపతి బ్యూరో: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రతిష్టాత్మక “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ లక్షా 24 వేల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికి అందించడంలో విశేష కృషి చేస్తున్న నేపద్యంలో అవార్డుకు అర్హత సాధించారు. శనివారం తిరుపతి రూరల్ పరిధిలోని చిగురువాడ అకార్డ్ స్కూల్ అవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న కృషిని గుర్తిస్తూ..”ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్” సంస్థ ప్రతినిధులు అవార్డ్ తో పాటు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతే కాకుండా తమ సంస్థకు శాశ్వత సభ్యత్వాన్ని కూడా అందించారు. పుడమిని, ప్రకృతిని పరిరక్షించే విధానంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లా ఎవరు పర్యావరణ హితం కోరి వేరెవరూ చర్యలు చేపట్టలేదని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి ఉమాశంకర్ పేర్కొన్నారు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకోవడం పట్ల తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, ఇతర ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1.24 లక్షల మట్టి విగ్రహాలు ఎక్కడికక్కడ తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివరించారు. పర్యావరణాన్ని పరి రక్షించటంలో పిల్లలు అందరూ భాగస్వామ్యం కావాలని, అప్పుడే భవిష్యత్తు తరాలకు పచ్చదనంతో కూడిన చక్కటి ప్రకృతిని అందించగలమని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 1.24లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను నిషేదిద్దాం అంటూ ప్లకార్డ్ లు చేత బట్టి విద్యార్థుల చేత ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అకార్డ్ స్కూల్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్లు ప్రశాంత్, వివేక్ లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS