కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.

Spread the love

కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర..

నేడు యాత్రలో పాల్గోనున్న సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే

Bharat JodoYatra: బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, కేంద్రం ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర గురువారం తిరిగి కర్ణాటకలో ప్రారంభమైంది.
విజయదశమి సందర్భంగా మంగళ, బుధవారాల్లో పాదయాత్రకు రాహుల్ విరామం ఇచ్చారు. గురువారం ఉదయం 6.30 గంటలకు తిరిగి పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఉదయం 11గంటల వరకు నాగమంగళ తాలూకా చౌడేనహల్లి గేట్ వద్దకు యాత్ర చేరుతుంది. సాయంత్రం 4:30 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభమై 7గంటలకు బ్రహ్మదేవరహల్లి గ్రామం వద్ద సభలో రాహుల్ ప్రసంగిస్తారు. రాత్రి నాగమంగళ తాలూకా ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి ఎదురుగా మడకే హోసూర్ గేట్ వద్ద రాహుల్, ఆయన బృందం బస చేస్తారు.

ఇదిలాఉంటే.. గురువారం భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే లు పాల్గోనున్నారు. కర్ణాటకలో మండ్య జిల్లాలో సోనియాగాంధీ రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. సోనియాగాంధీ సోమవారమే కర్ణాటక రాష్ట్రంకు చేరుకున్నారు. రెండు రోజులు కొడుగు జిల్లాలోని ఓ రిసార్ట్‌లో బసచేశారు. కాగా.. గురువారం ఆమె రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారు. వచ్చే సంవత్సరం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు పాదయాత్ర కీలకంగా మారింది.

సెప్టెంబర్ 30న కేరళ నుండి యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించి నాటి నుంచి రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, ఇతర ప్రాజెక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైపై రాహుల్ విమర్శలు చేస్తున్నారు. సోనియాగాంధీ యాత్రలో పాల్గోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మరింత రెట్టింపవుతుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

Related Posts

You cannot copy content of this page