The fight won’t stop until the property tax is lowered
ఆస్తి పన్ను తగ్గించే వరకు పోరాటం ఆగదు
-కౌన్సిలర్ వి.హనుమంత్ రెడ్డి, కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి
-పన్ను తగ్గించాలంటూ మున్సిపాలిటీలో భారీ ర్యాలీ
బొల్లారం మున్సిపల్ పరిధిలో అడ్డగోలుగా ఆస్తి పన్ను పెంచడంపై పన్ను చెల్లింపుదారులతో కలిసి కౌన్సిలర్లు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లారం పట్టణంలోనీ ప్రధాన వీధుల్లో ప్రజలు ప్రజా ప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వి.హనుమంత్ రెడ్డి , కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక్క బొల్లారం మున్సిపాలిటీలోని పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను వేయడం పై తీవ్రంగా మండిపడ్డారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
గత సంవత్సరం కట్టిన పన్నులపై తిరిగి మరల ఏరియర్స్ పేరిట ఆస్తి పన్ను వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మధ్యతరగతి ప్రజలపై అధిక పన్ను భారం వేస్తే ఏ విధంగా కడతారని ఆందోళన వ్యక్తం చేశారు.
పెంచిన పన్నుల భారంతో సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పెంచిన ఆస్తి పన్నును వెంటనే తగ్గించక పోతే తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూ మున్సిపాలిటీ బందుకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెంచిన పన్నులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ గోపాలమ్మ , చంద్రయ్య , కోప్షన్ సభ్యులు మునీర్ , స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి , రమణయ్య , శ్రీధర్ రెడ్డి , భాస్కర్ (మాజీ వార్డ్ సభ్యులు), చంద్రారెడ్డి వెంకటయ్య , మోహన్ రెడ్డి , రమేష్ రెడ్డి , శంకర్ , శ్రీనివాస్ , ఫార్జానా , నరేందర్ , లక్కన్ , దిగంబర్ , బాబు , వంశీ , ఆటో యూనియన్ నాయకులు, పన్ను చెల్లింపుదారులు, తదితరులు పాల్గొన్నారు.