ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు

ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు

SAKSHITHA NEWS

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఈ నెల 18న లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి లోకసభ ఎన్నికల ఏర్పాట్లపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటిని ఉంటుందని అన్నారు. నూతన కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేసి, నామినేషన్ ఫారాలు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పోటీచేసే అభ్యర్థి దేశంలో ఎక్కడైనా ఓటరుగా నమోదయివుండాలని, ప్రపోజర్లు ఆయా నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదై ఉండాలన్నారు. ఓటరు జాబితాలో ఓటరుగా నమోదైనది, లేనిదీ తనిఖీ చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 14 వరకు ఓటరుగా నమోదుకు అవకాశం ఉన్నప్పటికీ, ఆలస్యం చేయక వెంటనే నమోదులు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 5న 52987 ఎపిక్ కార్డులు పంపిణీ చేసినట్లు, 54866 కార్డులు ప్రింటింగ్ కొరకు ఇచ్చినట్లు ఆయన అన్నారు.

జిల్లాలోని 1459 పోలింగ్ కేంద్రాలన్నిటిలో అన్ని కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. కనీస సౌకర్యాల కల్పనతో పాఠశాలలు బాగుపడతాయన్నారు. 600 పోలింగ్ కేంద్రాల్లో బాత్ రూమ్ కమ్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టినట్లు ఆయన అన్నారు. తీవ్ర ఎండల దృష్ట్యా త్రాగునీరు, నీడకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ జారీకి చర్యలు చేపడతామన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. 3620 మంది పీవో ఏపీవో లకు శిక్షణ ఇచ్చినట్లు, ఇవిఎం ల నిర్వహణపై హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణా కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్లు, ఇడిసి లు ఎన్నికల విధుల సిబ్బంది నుండి తీసుకున్నట్లు ఆయన అన్నారు. ఏప్రిల్ చివరి వారంలో రెండో శిక్షణా ఏర్పాటుచేయనున్నట్లు ఆయన అన్నారు.

ఇవిఎం ల మొదటి విడత ర్యాoడమైజేషన్ ద్వారా ఏ ఏ సెగ్మెంట్ ఏ ఇవిఎం లు వెళ్ళాలో ఆన్లైన్ ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేశామన్నారు. శిక్షణా, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు 146 ఇవిఎంల కేటాయింపు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సి-విజిల్, టోల్ ఫ్రీ 1950 పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, జిల్లాలో 12 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 15 ఎస్ఎస్టీ, 15 ఎఫ్ఎస్టీ, పోలీసుల ద్వారా ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 54 కేసులు నమోదుచేసినట్లు, 359 లీటర్ల మద్యం, ఒక కిలో గంజాయి , 77 లక్షల 10 వేల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. 50 వేలకు పైబడి నగదుతో ప్రయాణిస్తున్నప్పుడు సంబంధిత నగదు డాక్యుమెంట్లు వెంట ఉండాలన్నారు. జిల్లాలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఫిర్యాదులు రాలేదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ వినోద్, డిఆర్డీఓ సన్యాసయ్య, డిపిఆర్వో ఎం.ఏ. గౌస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS