SAKSHITHA NEWS

కడ్తాల్ ఆధునిక పోలీస్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్, ఐపీఎస్.,
-ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్
రంగారెడ్డి జిల్లా లోని కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో కడ్తాల్ మండలం లోని కడ్తాల్ లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీరాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణలో విధి నిర్వహణలో తెలంగాణ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజల ఆస్తులను మానాలను ప్రాణాలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. Fortune Butterfly City సహకారంతో సుమారు 9000 Sft స్థలంలో, రూ.2 కోట్ల వ్యయంతో కడ్తాల్ లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కడ్తాల్ పోలీస్ స్టేషన్ లో ఆధునిక సాంకేతిక సాంకేతికతను వినియోగించుకొని కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పోలీస్ వ్యవస్థకు, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి దేశానికే ఆదర్శంగా తీర్చేదిద్దారన్నారు. తెలంగాణ పోలీస్ శాఖకు భారీ బడ్జెట్ను కేటాయిస్తూ మౌలిక సదుపాయాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో ప్రజల మనసులలో భద్రతాభావం ఏర్పడిందన్నారు.

ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని కితాబు ఇచ్చారు. ఎక్కడైతే శాంతిభద్రతలు బాగుంటాయో అక్కడికే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన పోలిసింగ్ కోసం ప్రభుత్వం పోలీస్ శాఖకు పోలీసు భవనాలు, వాహనాలు, మ్యాన్ పవర్, వెల్ఫేర్ తదితర సహాయసహకారాలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని భద్రత మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతుందన్నారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్, ఐపీఎస్., మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల శాంతిభద్రతలను కాపాడడంలో కృత నిశ్చయంతో ఉందన్నారు. ముఖ్యంగా మహిళల భద్రత కొరకు టాప్ ప్రయారిటీ ఇచ్చిందన్నారు. అధునాతన పోలీస్ భవనంలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు.

అనంతరం నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీరాములు మాట్లాడుతూ… కడ్తాల్ లో ఆధునిక సదుపాయాలతో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని భద్రత మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన పోలిసింగ్ కోసం ప్రభుత్వం పోలీస్ శాఖకు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందన్నారు. సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో నేరాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు పూర్తిగా విజయవంతమయ్యారన్నారు.

అనంతరం కడ్తాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సహాయ సహకారాలందించిన Fortune Butterfly City మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఛైర్మన్ బి. శేషగిరి రావు ని హోంమంత్రి మహమూద్ అలీ సత్కరించారు.

హోంమంత్రి మహమూద్ అలీ గారిని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సత్కరించారు.

నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీరాములు ని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సత్కరించారు.

తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్, ఐపీఎస్., ని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సత్కరించారు.

హోంమంత్రి మహమూద్ అలీ ని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సత్కరించారు.

కడ్తాల్ నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రత్యేకతలు..

Fortune Butterfly City సహకారంతో సుమారు అర ఎకరం స్థలంలో, రూ.2 కోట్ల వ్యయంతో కడ్తాల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మాణం చేపట్టారు.
మొత్తం 9000 Sft. వేల చదరపు అడుగుల్లో జి ప్లస్-1 అంతస్తుల్లో పోలీస్ స్టేషన్ ను నిర్మించారు.

గ్రౌండ్ ఫ్లోర్ లో.. ఇన్ స్పెక్టర్ ఛాంబర్(SHO), రిసెప్షన్, సి‌సి కమాండ్ కంట్రోల్ రూమ్, వర్క్ స్టేషన్, సి‌ఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, విమెన్ హెల్ప్ డెస్క్, లాకాప్స్ ఉన్నాయి.
ఫస్ట్ ఫ్లోర్ లో.. క్రైమ్ వర్క్ స్టేషన్, డిఐ, మల్టీ పర్పస్ హాల్, బ్యారెక్ లు, డైనింగ్ హాల్, యోగా అండ్ జిమ్ హాల్ ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో.. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీరాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, Fortune Butterfly City మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఛైర్మన్ శ్రీ బి శేషగిరి రావు, ఈ‌డి రమేశ్, కడ్తాల్ మండల్ జెడ్పిటిసి దశరథ నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, కడ్తాల్ సర్పంచ్ లక్ష్మీ నరసింహ రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ సింగల్ విండో చైర్మన్ వెంకటేష్, ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు జోగు వీరయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.

పోలీస్ శాఖ నుంచి.. తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్, ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, శంషాబాద్ ఏడీసీపీ రామ్ కుమార్, షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి, కడ్తాల్ ఎస్‌హెచ్‌ఓ హరి శంకర్ గౌడ్, కడ్తాల్ నూతన ఎస్‌హెచ్‌ఓ శివప్రసాద్, ఆమన్ గల్ ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2023 10 07 at 14.29.22 1

SAKSHITHA NEWS