బూర నరసయ్య గౌడ్ ఇంటికి వెళ్లిన బండి సంజయ్
▪️ పార్టీలో చేరికపై ముహూర్తం ఫిక్స్
హైదరాబాద్: టీఆర్ఎస్.. తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని.. నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదికైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను బీజేపీ బృందం కలిసి పార్టీలోకి ఆహ్వానించింది. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… స్వలాభం కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.
బూర నర్సయ్య గౌడ్ నిజాయితీకి మారు పేరని కొనియాడారు. దుబ్బాక, హుజూరాబాద్‌కు కేంద్రం ఇచ్చిన నిధులపై స్పష్టతనిచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను కేసీఆర్ ఇవ్వట్లేదన్నారు. బైపోల్స్‌లో ముఖ్యమంత్రిని ఒక గ్రామానికి ఇంచార్జ్‌గా పరిమితం చేసిన ఘనత బీజేపీదే అని అన్నారు.
దుబ్బాక, హుజూరాబాద్‌కు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బూర నర్సయ్య గౌడ్ రాకతో మునుగోడులో బీజేపీ బలం పెరిగిందన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బూర నర్సయ్య లాంటి నేతలు కేసీఆర్‌ను కలిసే పరిస్థితి లేదని మండిపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని బండి సంజయ్ పేర్కొన్నారు.