హైదరాబాద్:
సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి బాండెడ్ లేబర్ల కంటే అధ్వానంగా ఉందని రేవంత్ అన్నారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే హోంగార్డులు ఎలా బతకాలని లేఖలో ప్రశ్నించారు. హోంగార్డు రవీందర్ ను ఉన్నతాధికారులు వేధించారన్నారు.
రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా అధికారులు, తోటి సిబ్బంది వేధింపులతో హోంగార్డు రవీందర్ అత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని కలిగిచిందన్నారు. రవీందర్ భార్యాపిల్లలకు దిక్కెవరని రేవంత్ ప్రశ్నించారు.
ఇంత జరిగినా ఏ ఒక్క మంత్రిగాని, అధికారిని స్పందిచకపోవడం మరింత దారుణం. రవీందర్ది ఆత్మహత్య కాదని… ప్రభుత్వం చేసిన హత్య అని పేర్కొన్నారు. 2017లో హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి మోసం చేశారని రేవంత్ విమర్శించారు.
హోంగార్డుల డిమాండ్లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. రవీందర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఎస్సై నుంచి ముఖ్యమంత్రి వరకు కంటికి రెప్పలా కాపాడుతున్న హోంగార్డుల సమస్యలను పరిష్కారించాలనే సోయి ఏ ఒక్కరికి లేకపోవడం బాధాకరమని రేవంత్ పేర్కొన్నారు.
మీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి హోంగార్డుల మనోవేదనను అనుభవిస్తూనే ఉన్నారన్నారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా వారి సమస్యలను పరిష్కారించాలనే ఇంగిత జ్ఞానం మీకు లేకుండా పోయిందని రేవంత్ దుయ్యబట్టారు.
ఇకనైనా హోంగార్డుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలి. లేని పక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తాని రేవంత్ హెచ్చరించారు……..