రాజగోపాల్‌రెడ్డి మొదటి నుంచీ కాంట్రాక్టర్రే: బండి సంజయ్
సాక్షిత చండూరు: మునుగోడు ఉప ఎన్నిక తీర్పు కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఈ ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని చెప్పారు. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సంజయ్ మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి మొదటి నుంచీ కాంట్రాక్టర్ అని.. ఎంతో మందికి ఆయన ఆర్థికసాయం చేశారని తెలిపారు.
కేసీఆర్‌కి సొంత విమానం కొనేంత డబ్బు ఎక్కడిదని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కుదువ పెట్టేందుకు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘రామన్నగూడెం, శివన్నగూడెం భూములను గుంజుకుని ఒక్కరికీ డబ్బు ఇవ్వలేదు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తర్వాతే గట్టుప్పల్ మండలం ఏర్పడింది. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నా.. ఈ ప్రాంతాభివృద్ధి, ప్రజల కోసమే ఆయన రాజీనామా చేశారు’’ అని సంజయ్ అన్నారు.
రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా: కిషన్‌రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తొలగించారు. ఈ అహంకారాన్ని దెబ్బతీయడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎంత డబ్బు, మద్యం పంచినా ప్రజలు భాజపానే గెలిపిస్తారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన హుజూరాబాద్, దుబ్బాకలో ప్రజలు భాజపాని ఆశీర్వదించారు. అదేవిధంగా మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’’ అని ఆయన ప్రజలను కోరారు.
తెరాస దోపిడీ దుకాణం బంద్ అవుతుంది: ఈటల
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికతో తెరాస దోపిడీ దుకాణం బంద్ అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రచారంలో భాగంగా ప్రతి వాడకు, పల్లెకు వెళ్తామని చెప్పారు. ఎవరు వచ్చి ఏం చెప్పినా కాషాయం మాత్రమే గుండెల్లో ఉండాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈటల కోరారు.