భారత సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి..ఇవాళ పోచంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పోచంపల్లిలో ఫేమస్ అయిన చేనేత పరిశ్రమ గురించి ఆమె తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగిందని.. తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందని కొనియాడారు.
పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు ట్యాగ్ రావడం.. యూఎన్ఏ భూదాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమన్నారు. చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందన్నారు. చేనేత వస్త్రాల కృషి గొప్పదని కొనియాడారు. ప్రభుత్వం ద్వారా చేనేత కళాకారులకు మద్దతు దొరుకుతుందని.. చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాలని.. చేనేత రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మాటిచ్చారు. మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.