సాక్షితహైదరాబాద్ :
హైదరాబాద్లోని నెక్లె రోడ్ వద్ద 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస గౌడ్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఈ నీరా కేఫ్ లో నీరాతో పాటు ఫాస్ట్ ఫుడ్ కూడా అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను శుద్ధిచేసి ఇక్కడ విక్రయించడంతో పాటు పలు నీరా ఉత్పత్తులు కూడా ఇక్కడ లభిస్తాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఏడు స్టాల్స్ లో ఒకేసారి 5వందల మంది కూర్చునే సదుపాయంతో పాటు, టేక్ అవే సదుపాయం కూడా ఉంటుంది.
గీత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం నీరా కేఫ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లుగీత కార్మికుల సంక్షేమానికి కూడా పెద్ద పీట వేస్తున్నారు. రైతుబీమా పథకం మాదిరి గీత కార్మికులకు 5లక్షల రూపాయల భీమా సదుపాయాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. ప్రస్తుతం గీత కార్మకుల బీమా కింద 2 లక్షల రూపాయలుగా ఉన్న మొత్తాన్ని ప్రభుత్వం 5 లక్షల రూపాయలకు పెంచింది.
తాటి మరియు ఈత చెట్ల నుంచి సేకరించే నీరాకు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. చాలా మంది నీరాను ఇష్టంగా తాగుతారు. సహజసిద్ధంగా తాటి మరియు ఈత చెట్ల నుండి వచ్చే నీరాను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారికి రాళ్లు తొలగించడానికి, మధుమేహం, ఫ్యాటీలివర్, గుండెసమస్యల నివారణకు నీరా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.