తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించారు.
అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో మంత్రిని సత్కరించి స్వామి వారి తీర్ద, ప్రసాదాలు అందజేశారు.
సాక్షిత : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని *రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ * దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి సత్యవతి రాథోడ్ కి వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆ శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టమని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా బాగుండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
దేశ రాజకీయాల్లో రాజకీయ పరిణామాలను అందరూ గమనిస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ దేశ ప్రయోజనాలను పక్కనబెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృషి చేస్తుందని మంత్రి ధ్వజమెత్తరు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళుతూ ఉంటే ఆ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాల మెడలు వంచి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీతో ఇప్పుడు బిజెపి మెడలు వంచి గద్దె దించుతారనే భయంతోనే కెసిఆర్ కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకుగురి చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి జేబు సంస్థలుగా మార్చుకొని ఆ సంస్థల విశ్వసనీయతను దెబ్బ తీస్తున్నారని అన్నారు. ఈ దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి కొంతమంది వ్యక్తుల స్వార్ధ ప్రయోజనాల కోసం పని చేస్తున్న భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి ఆభగవంతుడు మంచి బుద్ధుని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరినట్లు మంత్రి తెలిపారు.