SAKSHITHA NEWS

ఐఐటీ విద్యార్ధికి మంత్రి నారా లోకేశ్ భరోసా

ఐఐటీ లక్నోలో సీటు సాధించిన అత్తిలి విద్యార్ధి బసవయ్య

ఫీజు చెల్లించలేని పరిస్థితిపై బసవయ్య ట్వీట్

ఫీజు విషయం తాను చూసుకుంటానంటూ లోకేశ్ హామీ

ఓ పేద విద్యార్ధి ఉన్నత చదువుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.

లక్నో ఐఐటీలో చదువుకోవాలన్న ఆ విద్యార్ధి కలను లోకేశ్ సాకారం చేస్తున్నారు. లక్నో ఐఐటీలో కోర్సు ఫీజు రూ.4 లక్షలు ఉందని, అంత ఖర్చు భరించే స్థితిలో తన తల్లిదండ్రులు లేరని ఎక్స్(ట్విటర్) వేదికగా నారా లోకేశ్‌కు ఆ విద్యార్థి తెలియజేయగా, వెంటనే స్పందించిన లోకేశ్ అతనికి భరోసా ఇచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్య అనే విద్యార్థికి ఇటీవల లక్నో ఐఐటీలో సీటు వచ్చింది. అయితే కోర్సు ఫీజు రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంది. పేదరికంలో ఉన్న తన తల్లిదండ్రులు అంత ఫీజు భరించే పరిస్థితి లేకపోవడంతో బసవయ్యకు ఏమి చేయాలో పాలుపోలేదు. తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ డబ్బుతోనే ఇప్పటి వరకూ అతన్ని చదివించారు. ఐఐటీ ర్యాంక్ సాధించినా లక్నో ఐఐటీలో విద్యనభ్యంసించలేని పరిస్థితి బసవయ్యది.

ఈ నేపథ్యంలో తన పరిస్థితిని బసవయ్య ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేశ్ కు విన్నవించాడు. లక్నో ఐఐటీలో సీటుకు ఫీజు చెల్లించే ఆర్థిక స్తోమత తమకు లేదని, చదువుకోవాలనే కోరిక బాగా ఉందని, తన పరిస్థితి చూసి సాయం చేయాలని బసవయ్య కోరాడు. దీనికి స్పందించిన లోకేశ్ రీట్వీట్ చేశారు. “బసవయ్య నువ్వు ఐఐటీ లక్నోలో చదువుతావు. నీ కల నెరవేరుతుంది. నీ ఫీజు విషయం నేను చూసుకుంటా. నీకు శుభాకాంక్షలు” అంటూ లోకేశ్ రీట్వీట్ చేశారు. దీంతో లోకేశ్ భరోసా పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విద్యార్థి కుటుంబసభ్యులు సైతం లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.


SAKSHITHA NEWS