మున్సిపల్ అధికారులకు: మంత్రి కేటీఆర్‌ సూచనలు

Spread the love

సాక్షిత హైదరాబాద్ :
పురపాలక శాఖ ఉన్నతాధి కారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై పురపాలక శాఖ అధికారులకు మంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు పోదామని అధికారులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అధికారంలదిరికీ ఇప్పటికే సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు.

ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలన్నారు. పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయని.. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైతే సాగునీటి శాఖతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు వాటిని కొంత ఖాళీ చేయించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తరలించాలని మంత్రి ఆదేశించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలపైన ఎక్కువ దృష్టి సారించాలన్నారు. సహాయ కార్యక్రమాల సమన్వయం కోసం హైదరాబాద్‌తో పాటు ప్రతి జిల్లాలోని కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పట్టణాల్లో ఉన్న రహదారులను వెంటనే మోటరబుల్‌గా తయారు చేయాలని.. దీని కోసం అవసరం అయిన తాత్కాలిక మరమత్తులు చేపట్టాలని తెలిపారు. ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ ని చేపట్టాలన్నారు. పేరుకుపోయిన నీటిని తొలగించేందుకు డీ వాటరింగ్ పంపులను కూడా వినియోగించాలన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీరును అందించాలని ఆదేశించారు. సురక్షిత తాగునీరు సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని పైపులైన్ల లీకేజీలు వెంటనే మరమ్మతులు చేయడము, తాగునీటి క్లోరినేషన్ వంటి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్‌వోలతో సమన్వయం చేసుకొని అవసరమైన వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

మిగిలిపోయిన శిధిలావస్థలో ఉన్న పురాతన భవనాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో జాగ్రత్తగా సమన్వయం చేసుకొని మరమత్తు కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page