సాక్షితహైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు విచారకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా ఆమె చెప్పారా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు.
‘‘ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం కట్టాలని 2015లోకే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ విషయం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కొత్త భవనం నిర్మించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కరోనా సమయంలో ఉస్మానియా వైద్యులు అద్భుతంగా పనిచేశారు. గవర్నర్‌కు వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆమె ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వైద్య రంగంలో కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నాం. మా పాలనలో చెడు మాత్రమే గవర్నర్ చూస్తారా? చెడుపై మాత్రమే ఆమె మాట్లాడతారా?
గవర్నర్ వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. అనవసరంగా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. కంటి వెలుగులాంటి కార్యక్రమాన్ని మెచ్చుకునేందుకు గవర్నర్‌కి మనసురాలేదు. నిమ్స్‌లో బెడ్స్ పెంపుపై ఆమె ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు? మాతా శిశుమరణాలు తగ్గించడంలో రాష్ట్రం అగ్రభాగాన ఉందని నీతి ఆయోగ్ చెబితే గవర్నర్‌కు కనిపించదు. మంచి మాకు కనబడదు… వినబడదు అనేరీతిలో తమిళిసై వ్యవహారశైలి ఉంది. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్.. భాజపా అధికార ప్రతినిధిలా మాట్లాడడం దురదృష్టకరం’’అని హరీశ్‌రావు అన్నారు.