మెదక్: మెతుకుసీమ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఉన్నత విద్యా సౌకర్యం లేని జిల్లాలో… ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వైపు అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కళాశాల మంజూరు కాగా, ప్రిన్సిపల్ నియామకంతో పాటు, నిర్వహణకు తగిన సౌకర్యాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ధారించింది. త్వరలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) బృందం జిల్లాకు రానుంది. ఆలోగా కళాశాల నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది.
240 పడకలు తప్పనిసరి
ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కావాల్సిన సదుపాయాలు ఉన్నాయా?లేవా? అనేది పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. వైద్యవిద్య రాష్ట్ర సంచాలకురాలు డా.వాణి, మెదక్ వైద్యకళాశాల ప్రిన్సిపల్ డా.రవీందర్, గాంధీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా సమన్వయకర్త(డీసీహెచ్)లు సభ్యులుగా ఉన్నారు. వీరు ఇప్పటికే మెదక్‌లో పర్యటించి వసతులపై ఆరా తీశారు. ప్రధానంగా కళాశాల ఏర్పాటు కావాలంటే అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 240 పడకలు ఉండాలి. మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 120, మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీˆహెచ్)లో 120 పడకలున్నాయి. మరో వైపు ఎంసీహెచ్ పక్కనే 50 పడకలతో క్రిటికల్ కేర్ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీంతో మార్గం సుగమం అయినట్లే. కళాశాల నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. తాత్కాలికంగా పిల్లికొట్టాల్‌లో పాత సమీకృత కలెక్టరేట్ కార్యాలయం కొనసాగిన భవనాన్ని ఎంపిక చేశారు.
ఏర్పాట్లు చేస్తున్నాం: డా.రవీందర్, ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్యకళాశాల, మెదక్
వైద్య కళాశాల ఏర్పాటుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం పాత కలెక్టరేట్ భవనాన్ని ఎంపిక చేశాం. కళాశాల ఏర్పాటుకు అవసరమయ్యే పడకలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాతా,శిశుసంరక్షణ కేంద్రంలో ఉన్నాయి. సౌకర్యాలను అద్దె భవనంలో కల్పించనున్నాం. ఆ తర్వాత కేంద్ర కమిటీ వచ్చి పరిశీలించి, ఆమోద ముద్ర వేస్తే వచ్చే విద్యాసంవత్సరంలో కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి.
రూ.180 కోట్లు మంజూరు
జిల్లాలో ఇంజినీరింగ్, ఇతర వృత్తి కోర్సుల కళాశాలలు లేవు. ప్రైవేట్‌వే ఉన్నాయి. ప్రభుత్వ పరమైనవి లేకపోవడంతో జిల్లాలో ఉన్న విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. ఈ మేరకు పక్కా భవన నిర్మాణానికి గతేడాది సెప్టెంబరులో రూ.180 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకోసం జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్‌లో 14 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
అన్నీ సమకూరితే
ప్రభుత్వ వైద్యకళాశాల పక్కా భవనానికి నిధులు మంజూరైనా, ప్రారంభమై…పనులు పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ మేరకు పాత కలెక్టరేట్‌లో కళాశాల నిర్వహణకు కావాల్సిన సదుపాయాలపై దృష్టి సారించారు. ఇందుకోసం రూ.2 కోట్లు అవసరమని కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అన్ని వసతులు సమకూరితే కేంద్ర వైద్య, విద్య కమిటీ వచ్చి పరిశీలించనుంది. ఆ తర్వాత ఆమోదముద్ర వేస్తే 2024-25 విద్యాసంవత్సరానికి తరగతులు ప్రారంభం కానున్నాయి. వంద సీట్ల సామర్థ్యంతో కళాశాల మంజూరు కాగా, అనుమతులు రాగానే మొదట బ్యాచ్‌లో 50 మంది విద్యార్థులతో కళాశాలను నిర్వహించనున్నారు……..