మెదక్ పురపాలిక బడ్జెట్ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్ అధ్యక్షతన పుర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, అదనపు పాలనాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అధ్యక్షుడు చంద్రపాల్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.50.91 కోట్ల అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించారు. మున్సిపాల్ సాధారణ నిధుల నుంచి రూ.9.86 కోట్లు, డిపాజిట్లు, రుణాల పద్దులు, వివిధ గ్రాంట్ల ద్వారా రూ.40.72 కోట్లు రాబట్టేందుకు అధికారులు అంచనా వేసి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బడ్జెట్‌పై కౌన్సిలర్లు కళ్యాణి, లలిత, మేఘమాల, ఆంజనేయులు మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా వివిధ సమస్యలను సమావేశంలో ప్రస్తావిస్తున్నా అధికారులు, అధ్యక్షులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
సభలో గందరగోళం
బడ్జెట్ ప్రకటన పూర్తి కాగానే ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ గౌడ్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ…గత ప్రభుత్వం వారి స్వార్థం, కమీషన్ల కోసమే కొన్ని పథకాలను ప్రవేశపెట్టారని ఆరోపించారు. దీంతో 5వ వార్డు కౌన్సిలర్ ఆంజనేయులు జోక్యం చేసుకొని ఇది రాష్ట్ర బడ్జెట్ సమావేశమా, లేక పురపాలిక బడ్జెట్ సమావేశమా అని అనడంతో ఎమ్మెల్యేకు కౌన్సిలర్‌కు మధ్య వాగ్వాదం జరగడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ.. మెదక్ అభివృద్ధిని అడ్డుకుంటూ, ఇన్ని రోజుల పాటు భారాసను వ్యతిరేకించి, ఎన్నికల సమయంలో రూ.10 లక్షలకు అమ్ముడు పోయిన వ్యక్తులా నన్ను ప్రశ్నించేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే ఇలాంటి వారిని రెచ్చగొట్టి పట్టణాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. బురదజల్లేందుకే కొందరు కౌన్సిలర్లు గొడవకు దిగుతున్నారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దన్నారు. సమావేశంలో పుర కమిషనర్ జానకిరామ్‌సాగర్, డీఈఈ మహేష్, టీపీవో భూపతి, ఆర్వో అర్షద్ తదితరులు ఉన్నారు.