శ్రీరాముడి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి
ఆరోగ్యం, సిరి సంపదలు అందించాలి.
ధర్మ బద్ద , ఆదర్శ జీవనానికి శ్రీరాముడి పాలన నిలువెత్తు నిదర్శనం
శ్రీరాముడి స్పూర్తితో కేసీఆర్ సంక్షేమ పాలన
కేసీఆర్ కు అండగా నిలవాలి
ప్రజలందరికీ ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రీరామనవమి శుభాకాంక్షలు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో సహా తెలంగాణ, దేశ ప్రజలందరికీ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో శుభప్రదమైన శ్రీరాముని జన్మదినం ప్రజలందరికీ ఎంతో ఆనందదాయకమన్నారు. సీతారాముల దీవెనలు, కరుణా కటాక్షాలు, అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు .
అందరికీ సుఖ, సంతోషాలు, మంచి ఆరోగ్యాన్ని, సిరి సంపదలను అందించాలని శ్రీరామచంద్రుడిని వేడుకున్నట్లు నామ తెలిపారు. సీతారాముల కల్యాణం చూసి, తరించిన వారికి జన్మ సార్ధకం కావడంతో పాటు ముక్తి కలిగి, సర్వ దోషాలు తొలగి, సర్వ శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. శ్రీరాముని జీవితం ధర్మ బద్ద, ఆదర్శమైన జీవనానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య, మాట తప్పని వైనం, మడమ తిప్పని శౌర్యం శ్రీరాముడి సొంతమన్నారు. మనిషి ఎలా బతకాలో, ప్రజల కష్ట సుఖాల్లో ఎలా మమేకం కావాలి.. సుభిక్ష రాజ్యపాలన ఎలా ఉండాలో శ్రీరాముడు తన పాలన ద్వారా ఈ జగతికి తెలియజేశారని అన్నారు. శ్రీ రాముడుని స్మరించడమే కాదు.. వారి ఆదర్శ జీవన విధానాన్ని కూడా పాటించాలన్నారు. శ్రీరామ స్మరణ మానవులకు మిక్కిలి జ్ఞానాన్ని, జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈ శ్రీరామ నవమి కరోనా కష్టాల నుంచి, ఆర్ధిక ఇబ్బందుల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని శ్రీరాముడిని ప్రార్ధించానని తెలిపారు. అభిజిత్ ముహూర్తంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రంలో అంగ రంగ వైభవంగా కన్నుల పండుగగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఎంతో ఘనంగా …వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ
మహెూత్సవాన్నినయ నానందంగా కన్నులారా తిలకించి, పులకించేందుకు దేశ నలుమూలల నుంచి భద్రగిరికి చేరుకున్న లక్షలాది మంది భక్తులందరికీ శుభాబీనందనలు తెలియజేస్తున్నట్లు నామ పేర్కొన్నారు.
శ్రీరామఘట్టం అద్భుత చారిత్రక చరితమని అన్నారు. తండ్రి మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి, ఉవ్వెతున ఉప్పెనలా ఉద్యమించి, తెలంగాణ ప్రజలందరినీ సమీకరించి, సమైఖ్యపరిచి, తెలంగాణాను సాధించి, శ్రీరామ రాజ్యపాలన స్పూర్తితో ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలిచారని అన్నారు. శ్రీరాముడి కాలంలోనూ వర్షాలు బాగా కురవడం వల్ల పంటలు బాగా పండి, రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేదంట.. అలాగే కేసీఆర్ పాలనలో అద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి పధకాలతో,కుండపోత వర్షాలతో , లారీల్లో సరిపోని పంటల కుప్పలతో తెలంగాణా ఎంతో సుభిక్షంగా, సస్య శ్యామలంగా ఉందంటే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ గారిదేనని అన్నారు. రావణాసూరుడు లాంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణాపై కక్ష గట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పైసా ఇవ్వకపోయిన కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర నిధులతో ముందుకు దూసుకుపోతూ, దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. మనమంతా కేసీఆర్ కు కొండంత అండగా నిలవాలని నామ నాగేశ్వరరావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.