SAKSHITHA NEWS

Laddu making with automatic machines in Tirumala

తిరుమల లో ఆటొమెటిక్ యంత్రాలతో లడ్డు తయారీ కానుంది

తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు నాటికి తిరుమల మ్యూజియాన్ని ప్రపంచంలోనే నంబర్‌ 1 స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.

తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి వేడుకులకు భక్తులు విశేషంగా తరలి వచ్చారన్నారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయినట్లు చెప్పారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించినట్లు తెలిపారు.

తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న రధసప్తమి వేడుకలకు సంబంధించిన కానుకల లెక్కింపు చేపట్టనున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు చెప్పిన ఆయన.. త్వరలో మరో తేదీని నిర్ణయిస్తామని అన్నారు.

తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం జరుగుతోందని, తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనంద నిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళ్తున్నామని చెప్పారు.

ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుండటంతో తాపడం పనులు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.భక్తులకు మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా ‘TTDevastanam’ పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.

దీనిద్వారా శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ కోసం స్లాట్‌ను బుక్‌ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చని తెలిపారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని అన్నారు.

ఎస్వీబీసీ ఛానెల్‌ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించే సదుపాయం ఉంటుందని అన్నారు. గత నెలలో 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. హుండీ కానుకలు రూ.123.07 కోట్లు కాగా, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.1.07 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.


SAKSHITHA NEWS